IRCTC website : ‘ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (Indian Railway Catering and Tourism Corporation – IRCTC)’ వెబ్సైట్ మరోసారి డౌనయ్యింది. మంగళవారం ఉదయం ఆశ్చర్యకరంగా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలోనే వెబ్సైట్ మొరాయించింది. దాంతో యూజర్లు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ప్రస్తుతం వెబ్సైట్ను సరిదిద్దే పనులు కొనసాగుతున్నాయని, అందువల్ల కొంతసేపు టికెట్ బుకింగ్లు, కాన్సిలేషన్లు చేయడం వీలుపడదని ప్రకటించారు.
కాగా, ఐఆర్సీటీసీ వెబ్సైట్ డౌన్ అవడం ఈ నెలలో ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే రెండు సార్లు ఈ సమస్య వచ్చింది. తాజాగా మూడోసారి సమస్య తలెత్తింది. డిసెంబర్ 26న ఏకంగా గంటన్నర పాటు బుకింగ్స్ నిలిచిపోయాయి. అంతకు ముందు డిసెంబర్ 9న కూడా వెబ్సైట్ రెండు గంటలపాటు సతాయించింది. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్బంగా టూర్ ప్లాన్ చేసుకున్నవాళ్లు టికెట్ బుక్ చేసుకుందామంటే సమస్య తలెత్తింది.
వెబ్సైట్ ట్రాకర్ డౌన్ డిటెక్టర్ ప్రకారం దాదాపు 47 శాతం మందికి వెబ్సైట్ యాక్సెస్ కాలేదు. 42 శాతం మందికి యాప్ ఓపెన్ కాలేదు. 10 శాతం మంది టికెట్ బుకింగ్ చేసుకోలేకపోయారు. ఉదయం 10 గంటల నుంచి యూజర్లు పలు సమస్యలు ఎదుర్కొన్నారు. దీనిపై రైల్వేశాఖ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో రెండుసార్లు సైట్ డౌన్ అయినప్పుడు కూడా రైల్వే శాఖ ఎలాంటి స్పందన తెలుపలేదు.
కాగా ఈ నెలలో మూడు సందర్భాల్లోనూ తత్కాల్ టికెట్లు ప్రారంభం కావడానికి సరిగ్గా 10 నిమిషాల ముందే ఉదయం 9.50 గంటలకు సైట్ డౌన్ కావడం గమనార్హం.