ఖమ్మం సిటీ, మార్చి 8: ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయి దినదినగండంగా బతుకులీడుస్తున్న నిరుపేదలకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బాసటగా నిలుస్తున్నారు. వారికి ‘పువ్వాడ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ప్రతిరోజూ రెండు పూటలా భోజనాలు పెడుతున్నారు. ఆదివారం సైతం ఖమ్మం నగరంలోని టీటీడీసీ, అంబేద్కర్ భవనాల్లో ఉన్న ఆశ్రయం పొందుతున్న బాధితులకు మధ్యాహ్నం, రాత్రిపూట ఆహారం అందించారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, పలువురు ముఖ్యనాయకులు కలిసి భోజనాలు వడ్డించారు.
ఈ సందర్భంగా పగడాల నాగరాజు మాట్లాడుతూ పేదల జోలికి వెళ్లిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని, కాంగ్రెస్ సర్కార్‌కు కూడా అదే గతి పడుతుందన్నారు. టీటీడీసీ, అంబేద్కర్ భవనాల నుంచి పేదలను రాత్రికి రాత్రే పేదలను వెళ్లగొట్టే కుట్రలు చేస్తున్నారని, వారిని ముట్టుకుంటే ఖమ్మం అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు కొల్లు పద్మ, ఆరెంపుల వీరభద్రం, బోజెడ్ల రామ్మోహన్, న్యాయవాది పిడతల రామ్మూర్తి, తోడేటి లింగరాజు, పోలెపొంగు వెంకట్, పిట్టల తిరుమల్, మోటె కుమార్, గుంటి రాజు పాల్గొన్నారు.

