Crime news : పక్షవాతం వచ్చి మంచంపట్టిన భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి చంపేసింది. ఆ తర్వాత దాన్ని సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసుల తమదైన శైలిలో విచారించడంతో నిజం ఒప్పుకుంది. మహారాష్ట్ర (Maharastra) లోని నాగ్‌పూర్ సిటీ (Nagpur city) లో ఇటీవల ఈ దారుణ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. దిశా రామ్టెకే (30), చంద్రసేన్ రామ్టెకే (38) ఇద్దరు భార్యభర్తలు. 13 ఏళ్ల క్రితం వారి వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం చంద్రసేన్ పక్షవాతం వచ్చి మంచంపట్టాడు. అప్పటి నుంచి దిశా రామ్టెకే నీళ్ల క్యాన్లు అమ్మి భర్తను పోషిస్తోంది. ఈ క్రమంలో దిశకు ఆసిఫ్ ఇస్లాం అన్సారీ అలియాస్ రాజబాబు టైర్‌వాలా అనే మెకానిక్‌తో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం వివాహేతర బంధానికి దారితీసింది. ఆ బంధం పక్షవాతంతో మంచంపట్టిన చంద్రసేన్ రామ్టెకేకు తెలిసిపోయింది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే దిశ తన ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం భర్త నిద్రిస్తున్న సమయంలో ఆసిఫ్‌ను పిలిచి హత్య చేయించింది. దిశ భర్తను కదలకుండా పట్టుకోగా ఆసిఫ్ అతడి ముఖంతో దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు.