Crime news : ఆమె వివాహిత మహిళ. భర్తతో గొడవపడి బయటికి వెళ్లింది. రాత్రి రైల్వేస్టేషన్లో ఒంటరిగా కూర్చున్న ఆమెను ఓ వ్యక్తి రైలు బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అతని ఇద్దరు స్నేహితులు అక్కడికి వచ్చి వాళ్లు కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత నిస్సహాయ స్థితిలోకి వెళ్లిన మహిళను సోనిపట్ (Sonipat) కు తీసుకెళ్లి రైలు పట్టాలపై పడేసి పారిపోయారు. రైలు కాలు పైనుంచి పోవడంతో ఆమె కాలు తెగిపోయింది. హర్యానా (Haryana) లోని పానిపట్ (Panipat) లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పానిపట్‌కు చెందిన మహిళ ఈ నెల 24న భర్తతో గొడవ పెట్టుకుని బయటికి వెళ్లింది. గతంలో కూడా ఇలాగే వెళ్లి మరుసటి రోజు తిరిగి రావడంతో అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే రెండు రోజులైనా రాకపోవడంతో జూన్ 26న ఖ్విల్లా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సదరు మహిళ కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు జూలై 6న (ఆదివారం) పోలీసులకు ఆమె ఆచూకీ లభ్యమైంది. కాలు కోల్పోయి సోనిపట్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం స్పృహలోకి వచ్చి జరిగిన దారుణం గురించి వెల్లడించింది.
తాను భర్తతో గొడవ తర్వాత పానిపట్ రైల్వేస్టేషన్‌కు వెళ్లి కూర్చున్నానని, అక్కడికి ఓ వ్యక్తి మీ భర్త పంపించాడని చెప్పి వచ్చాడని, ఇంటికి తీసుకెళ్తానని చెప్పి ఓ ఖాళీ రైలుబోగీలోకి తీసుకెళ్లాడని, అక్కడ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆపై మరో ఇద్దరిని పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డారని, వాళ్లతో పెనుగులాడి తాను అలసిపోయానని, నిస్సహాయ స్థితిలో తనను సోనిపట్‌కు తీసుకెళ్లి రైలుపట్టాలపై పడేసి పారిపోయారని, రైలు కాలుపై నుంచి వెళ్లడంతో తను కాలు కోల్పోయానని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని, స్పృహ వచ్చేసరికి ఆస్పత్రిలో ఉన్నానని ఆమె చెప్పారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.