గద్వాల, మార్చి 9 : ధరూర్-గద్వాల మండల గ్రామాల ప్రజల మధ్య జూరాల హైలెవల్ రోడ్డు కొత్త బ్రిడ్జి నిర్మాణం గతంలో ధరూర్, గద్వాల మండలంలోని పలు గ్రామాల మధ్య చిచ్చు రేపగా, ప్రస్తుతం నాయకులు మధ్య బ్రిడ్జి నిర్మాణంపై వార్ కొనసాగుతుంది. ఆదివారం హైదరబాద్‌లోని ఎర్రమంజిల్ జలసౌధలో నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టుల సమీక్షా సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలతోపాటు మంత్రులు, ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. బ్రిడ్జ్రి వివరాలల్లోకి వెళితే.. ప్రస్తుతం ఉన్న జూరాల ప్రాజెక్టు బ్రిడ్జిపై భారీ వాహనాలు వెళ్లడం వల్ల ప్రాజెక్టు ముప్పు పొంచి ఉండడం, వరదల సమయంలో గేట్లు ఎత్తి , దించే విషయంలో ప్రాజెక్టుపై ట్రాఫిక్ జామ్ కావడం వంటి సమస్యలతో బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉన్నది. దీంతో భవిష్యత్‌లో జూరాల బ్రిడ్జికి ఎటు వంటి ప్రమాదం లేకుండా దిగువన బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చాలాకాలం నుంచి ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి.
ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం కావడంతో ఎవరు దానిపై ఎక్కువగా దృష్టి పెట్టలేదు. 28 జూన్ 2025న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జూరాల ప్రాజెక్టు సందర్శనలో భాగంగా గద్వాల జిల్లా రేవులపల్లి నుంచి వనపర్తి జిల్లా నందిమళ్ల గ్రామాల మధ్య హైలెవల్ రోడ్డు బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 1జూలై 2025 నాడు జీవో నెం యూఎన్-4869/పీఆర్వోజే-11ఏ1/2020 న రూ.121.92కోట్లు తో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు జీవో విడుదల చేశారు. అయితే ఏమి జరిగిందో తెలియదు కానీ ప్రభుత్వం గద్వాల జిల్లా కొత్తపల్లి- వనపర్తి జిల్లా జూరాల గ్రామాల వద్ద బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చింతరేవుల, నర్సన్‌దొడ్డి, ఎములోనిపల్లి, పెద్దపాడ్, వామనపల్లే, ఉప్పేర్ గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తూ జూరాల ప్రాజెక్టుపై ధర్నా నిర్వహించారు. పై గ్రామాల ప్రజల వాదన.. ప్రాజెక్టు నిర్మాణంలో తమ భూములు పోగొట్టుకున్నామని, ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయామని, ప్రాజెక్టు దగ్గర ప్రభుత్వ భూమి సుమారు 100 ఎకరాలు ఉందని రాకపోకలు ఎటువంటి ఇబ్బంది లేదని వారి వాదన. అయితే గతంలో బ్రిడ్జి నిర్మాణం కొత్తపల్లి దగ్గర ప్రతిపాదించారని కొత్తపల్లి గ్రామస్తుల వాదన.
అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపడితే పీజేపీ డ్యాం సేఫ్టీనా..?
కొత్తపల్లి దగ్గర బ్రిడ్జి నిర్మాణం చేపడితే ప్రాజెక్టుకు సేఫ్టీ ఉంటుందా? అనే దానిపై జిల్లాలో రాజకీయ వార్ నెలకొంది. అక్కడ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపడితే డ్యాంకు సేఫ్టీనేనా అనే భావన రాజకీయవర్గాల్లో చర్చ కొనసాగుతుంది. అక్కడ నిర్మాణంపై ఎంపీ డీకే అరుణ అనుమానం వ్యక్తం చేశారు. ఎక్కడైనా ప్రాజెక్టులు నిర్మాణం జరిగిన సమయంలో దాని దిగువ భాగాన సేఫ్టీ బ్రిడ్జి నిర్మాణాలు చేపడతారని అయితే ఎవరి స్వలాభం కోసం అధికారులు, పాలకులు ఏమి ఆలోచించి అక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండా వేరే ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం ఎందు కు చేస్తున్నారో అర్థం కావడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్తపల్లి- ఆత్మకూర్ దగ్గర నిర్మాణం చేపట్టే బ్రిడ్జి నిర్మాణానానికి తాను వ్యతిరేకం కాదని అక్కడ ఆర్అండ్బీ ఆధ్వర్యంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఇక్కడి కాంగ్రెస్ నాయకులు డీకే అరుణ తమ రాజకీయ స్వలా భం కోసం బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణంపై రాజకీయ నాయకుల మధ్య వార్ కొనసాగుతుండడంతో .. చివరకు ఈ వార్ ఎక్కడి వరకు వెళ్తుందో అని అందరూ వేచి చూడాల్సిందే.