Asaduddin Owaisi : అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) బీహార్ (Bihar) లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో ఓటర్ లిస్టు (Voter list) ను సవరించాలని నిర్ణయించడంపై ఏఐఎంఐఎం (AIMIM) పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) అసహనం వ్యక్తం చేశారు.
తాను ఓటర్ జాబితా సవరణకు వ్యతిరేకంగా కాదని, కానీ ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు జాబితాను సవరించాలనుకోవడం సముచితం కాదని అన్నారు. ప్రజలకు కొంత సమయం ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. బీహార్ ఓటర్ లిస్టు సవరణపై తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి వెళ్లిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సవరించే ఓటర్ జాబితాలో 15 నుంచి 20 శాతం మంది పేర్లు గల్లంతైనా వాళ్లు కేవలం తమ ఓటు హక్కును మాత్రమే కోల్పోరని, తమ పౌరసత్వాన్ని కూడా కోల్పోతారని అసదుద్దీన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజల జీవనానికి సంబంధించిన సమస్య అని అన్నారు. కేవలం రెండు నెలల వ్యవధిలో ఓటర్ జాబితాను సవరించడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికల సంఘం తీరుతో బీహార్ పౌరులు సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని, ఎలాంటి సమస్యలు ఎదురుకానున్నాయనే విషయాన్ని తాను ఎన్నికల సంఘం దృష్టికి తేదలుచుకున్నానని, అందుకే ఇక్కడికి వచ్చానని ఒవైసీ చెప్పారు.