హైదరాబాద్ : రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ( Harish Rao ) అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ( Farmers ) ఉసురు పోసుకుంటోందని ట్విటర్లో ఆరోపించారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమీషన్లకు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.
ఫిబ్రవరి 4న మిర్యాలగూడ బహిరంగ సభలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతుబంధు జమచేస్తాం. ఇప్పటికే నిధులు సమకూర్చుకున్నామని ముఖ్యమంత్రి ప్రగల్భాలు పలికారని పేర్కొన్నారు. పత్రికల్లో లీకులు ఇచ్చి అనుకూల వార్తలు రాయించుకున్నారని, తీరా ఎన్నికల కోడ్ ముగిసి పది రోజులు దాటుతున్నా రైతుబంధు ఊసే లేదని అన్నారు. రెండు రోజుల క్రితం జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లోనూ రైతు బంధుపై ఉలుకు లేదు, పలుకు లేదని వెల్లడించారు.
రైతుబంధుకు ఎగనామం
ఎన్నికల ముందు ఎకరానికి రూ.15వేలు ఇస్తామని రైతులను నిలువునా మోసం చేసి, ఇప్పటికే రెండు సీజన్ల రైతుబంధుకు ఎగనామం పెట్టారని ఆరోపించారు. కేవలం ఓట్ల కోసమే రైతుబంధు పేరుతో నాటకాలు ఆడుతుందని అన్నారు. రైతులకు సకాలంలో రైతుబంధు ఇవ్వడానికి నిధులు లేవంటున్న రేవంత్ రెడ్డి , మూసీ సుందరీకరణకు వేల కోట్లు, సుందరీకరణలో భాగంగా కూల్చే ఇండ్లకు వేల కోట్లు పంచిపెట్టడానికి, మూసీలో పార్కులు కట్టడానికి వేలకోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. ఫోర్త్ సిటీ పేరుతో భూసేకరణకు , రోడ్ల నిర్మాణానికి వేల కోట్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు.
కమిషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు
ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే బడా కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం 25 వేల కోట్ల బిల్లులు చెల్లించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని వివరించారు. ఢిల్లీ పెద్దలకు మూటలు పంపడానికి వేల కోట్లు ఉంటాయి కానీ, కష్టాల్లో ఉన్న రైతన్నకు రైతుబంధు ఇవ్వడానికి మాత్రం చేతులు రావా? అంటూ నిలదీశారు.
ఒకవైపు ఇనుప కంచెలు లేని ప్రజా పాలన అని గొప్పలు చెప్తూనే.. ముఖ్యమంత్రి నివాసముంటున్న జూబ్లీహిల్స్ లో వందల కోట్లతో ప్యాలెస్ లాంటి క్యాంప్ కార్యాలయం కట్టుకుంటున్నారని విమర్శించారు. క్యాంప్ ఆఫీస్ చుట్టూ బలమైన ఇనుప కంచెల కోసమే 9 కోట్లు ఖర్చు చేస్తున్నారని దీనిని బట్టి మీ ఏడో గ్యారెంటీ ప్రజాస్వామిక పాలన ఎంత గొప్పగా వర్ధిల్లుతుందో అర్థమవుతోందని అన్నారు.
ప్యాలెస్ పక్కనే రూ. 5 కోట్లతో ఫుట్ బాల్ ఆడుకోవడానికి ప్రత్యేకంగా కోర్టు కట్టుకుంటున్నారని, అందాల పోటీలకు, ఫుట్ బాల్ మ్యాచ్ లకు వందల కోట్లు ఖర్చు పెడుతూ, అన్నంపెట్టే రైతన్న నోట్లో మాత్రం మట్టి కొడుతున్నారని హరీష్‌రావు ఆరోపించారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న మోసపూరిత వైఖరిని, అన్నదాతలను పెడుతున్న తిప్పలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా పగటివేషాలు, ఓట్ల కోసం నాటకాలు కట్టిపెట్టి, రైతులందరికీ రైతుబంధు నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.