నల్లగొండ, ఆగస్టు 5: ఎంపీడీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సాధారణ ప్రజలనే కాకుండా, పంచాయతీ కార్యదర్శులను సైతం వణికిస్తున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఎలాంటి పర్మిషన్ కావాలన్నా వారి చేయి తడపనిదే ఫైల్ కదలదు..పర్మిషన్ రాదు. పైగా ఆఫీసులకు వెళ్లిన సాధారణ జనమే కాదు ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు సైతం వీరు కనీస గౌరవం ఇవ్వకపోవటంతో పాటు ఏమైనా.. ఉందా.. లేదా అంటూ నిర్మొహమాటంగా అడిగేస్తున్నారు. దాంతో మండల ఆఫీసులకు ఏదైన పర్మిషన్‌కు వెళ్లాలంటేనే జనం జంకాల్సిన పరిస్థితి వస్తోంది.
ఒకే మండలంలో ఎనిమిది నుంచి పదేండ్లకు పైగా పాగా వేయటంతో వారిని ఎంపీడీవోలు సైతం కనీసం మందలించలేని పరిస్థితి ఉన్నట్లు తెలుస్తున్నది. పేరుకు వీరు కాంట్రాక్టు ఉద్యోగులే అయినా రెగ్యులర్ ఉద్యోగులకు మించి బిల్డప్ ఇస్తూ ఎంపీడీవోలను కూడా బేఖాతర్ చేస్తున్నారట. గ్రామాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని విచారించి నోట్ ఫైల్ రెడీ చేస్తున్నది పంచాయతీ కార్యదర్శులే అయినప్పటికీ ఎంపీడీవో ఆఫీసులో అందుకు సంబంధించిన వివరాలు ఈ పోర్టల్ వెబ్సైట్లో ఉంటాయి. అయితే ఆ వివరాలను ఆన్లైన్ చేసి లాగిన్ అయి నంబర్ ఇవ్వటానికి డబ్బు చేతిలో పెట్టనిదే పని కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతి పంచాయతీ కార్యదర్శికి ఈ పంచాయతీ పోర్టల్ లాగిన్ ఇచ్చి శిక్షణ ఇస్తే ఆపరేటర్లతో సంబంధమే ఉండదని కార్యదర్శులు పేర్కొంటున్నారు.
పైసల్లేనిదే ఫైలు కదలదు..
గ్రామ పంచాయతీలకు సంబంధించిన పనులను ఆన్లైన్ చేయటంతో పాటు ప్రభుత్వ నివేదికలు సిద్ధం చేయటం, పాత రికార్డులు స్కాన్ చేసి ఆన్లైన్ చేయటం, డేటా ఎంట్రీ, డెత్, బర్త్, తదితర వ్యాపారలావాదేవీలకు సంబందించిన అనుమతులను ఈ పంచాయతీ పోర్టల్‌లో లాగిన్ అయి ఆన్లైన్ చేసి నంబర్ ఇవ్వటం వీరి పని. అయితే ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు స్థానిక పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించి కావాల్సిన వివరాలు, ధృవ పత్రాలు సేకరించి పంచనామా చేసి నోట్ ఫైల్ సిద్ధం చేసి ఈ పంచాయతీ ఆపరేటర్లకు ఇస్తారు.
వారు వాటిని ఆన్లైన్ చేసి దరఖాస్తుదారునికి నంబర్ ఇస్తే వారు అందుకు సంబంధించిన పర్మిషన్ పత్రం మీ సేవలో తీసుకుంటారు. అయితే ఇక్కడ ఆన్లైన్ చేసి నంబర్ ఇచ్చేందుకు ఆపరేటర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని…లేదంటే సర్వర్ రావటం లేదని, తనకు అర్జెంట్ పని ఉన్నదంటూ దాటవేస్తున్నారని దరఖాస్తుదారులతో పాటు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పనిచేసే గ్రామాల్లోనే డబ్బులు వసూలు చేస్తుంటే ఎలా అని, తాము గ్రామాల్లో ఎన్నో విమర్శలకు గురవుతున్నామని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు. ప్రధానంగా వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన అనుమతుల్లో వేలల్లో డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
పదేండ్లుగా బదిలీలు లేవు..
ఉమ్మడి జిల్లాలో 2015 జూన్‌లో 119 మందిని డేటా ఎంట్రీ ఈ పంచాయతీ ఆపరేటర్లుగా నియమించారు. కాగా వీరితోపాటు మండల పం చాయతీ ఆపరేటర్లుగా 2018 జూ న్లో 71 మందిని నియమించా రు. అంటే మొత్తం 190 మం దిని నియమించి కాంట్రాక్టు వేతనాన్ని ప్రభుత్వం ఇస్తోంది. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన అనంతరం వారిని అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పేర్కొంటూ సర్క్యులర్ జారీ చేసింది. దీంతోపాటు వీరికి వేతనంగా రూ.19.500 ఇస్తున్నారు. అయితే వీరు వసూళ్ల పేరుతో బాగా సంపాదిస్తూ విలాస జీవితం గడుపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
కొందరు ఎనిమిదేండ్ల నుంచి పదేండ్లు పనిచేస్తున్న చోటే పా తుకుపోయారు. వీరి బదిలీలను అధికారులు పట్టించుకోవటం లేదు. ఇటీవల కాలంలో రిక్వెస్టుల పేరుతో కొంత మందిని బదిలీ చేయ గా చాలా మంది సొంత మండలాల్లోనే పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా దేవరకొండ, చం దంపేట, నేరేడుగొమ్ము లాంటి మండలాల్లో ఒక్కరే పనిచేస్తుండగా శాలిగౌరారం, నల్లగొం డ లాంటి మండలాల్లో ముగ్గురు నుంచి ఐదుగురు పనిచేస్తున్నారు. ఒక్కరున్న దగ్గర పనిభారం ఎక్కువ అవుతుండగా నలుగురైదుగురు ఉన్న చోట అంతగా ఇబ్బంది లేదు.
కార్యదర్శుల శిక్షణ పట్టని యంత్రాంగం
గ్రామాలకు సంబంధించిన అన్ని విషయాలపై పంచాయితీ కార్యదర్శులే ఫీల్డ్‌పై విచారణ చేసి ఫైల్ సిద్ధం చేస్తున్నప్పటికీ దాన్ని ఆన్లైన్ చేయటానికే మండల కార్యాలయాలకు రావాల్సి వస్తోంది. 2019లో పెద్ద ఎత్తున పంచాయతీ కార్యదర్శుల నియామకం జరిగినప్పటికీ ప్రతి కార్యదర్శి వద్ద ఈ పోర్టల్ వెబ్సైట్ లాగిన్ ఆప్షన్ ఉంది . అయితే వారికి సంబంధిత పోర్టల్‌లో లాగినై ఆన్లైన్ చేసే విషయంలో అవగాహన లేనందున ఆపరేటర్లనే ఆశ్రయించాల్సి వస్తున్నది. ఈ పద్ధతిని మార్చి పంచాయతీ కార్యదర్శులకు ఈ పోర్టల్ వెబ్సైట్లో లాగిన్ ఆప్షన్ కల్పించి ఆన్లైన్ చేసే విధానంపై శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నా జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోనందునే జాప్యం జరుగుతున్నదని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు ధృవ పత్రాలు, అనుమతుల కోసం ఆపరేటర్లు డబ్బులు వసూలు చేస్తే తాము బద్నాం అవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వసూళ్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం..
ఎంపీడీవో కార్యాలయాల్లో పని చేసే ఈ పంచాయతీ ఆపరేటర్లు డబ్బులు తీసుకుంటున్నట్లు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. వారు కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రమే. డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలితే ఉద్యోగం నుంచి తీసివేస్తాం. కొన్ని మండలాల్లో ఒక్కరు.. మరికొన్ని మండలాల్లో ఐదుగురు ఉన్న విషయంపై ఆరా తీసి త్వరలో సెట్ చేసేందుకు చర్యలు చేపడ తాం. అయితే ప్రతి పంచాయతీ కార్యదర్శి వద్ద ఈ పంచాయతీ పోర్టల్ వెబ్సైట్ లాగిన్ అయ్యే ఆప్షన్ ఉంది. దానిలో ఆప్‌లోడ్ చేసి ఆన్లైన్ చేసే విధానంపై త్వరలోనే శిక్షణ ఇచ్చి డీఎస్కేలు కూడా వారివద్దే ఉంచే విధంగా చర్యలు తీసకుంటాం.
-తరుణ్ చక్రవర్తి, డీపీవో, నల్లగొండ