Plastic Currency | ఇక ప్లాస్టిక్ కరెన్సీ.. వచ్చే ఏడాది నుంచి చలామణిలోకి.. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడి
త్వరలో ప్లాస్టిక్ కరెన్సీని చలామణిలోకి తేబోతున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. 3 రోజుల ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష బుధవారం ముగియగా.. ఆ నిర్ణయాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మల్హోత్రా మాట్లాడుతూ..
- ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడి
- ఈసారి ద్రవ్య సమీక్షలోనూ రెపోరేటు యథాతథం
ముంబై, ఆగస్టు 5 : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీని చలామణిలోకి తేబోతున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. 3 రోజుల ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష బుధవారం ముగియగా.. ఆ నిర్ణయాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మల్హోత్రా మాట్లాడుతూ.. దీర్ఘకాలంపాటు మన్నికగా ఉండే పాలీమర్ కరెన్సీని వచ్చే ఆర్థిక సంవత్సరం (2027-28) ఆరంభంలో చలామణిలోకి తేవాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. ఇప్పటికే ఆయా దేశాల్లో పాస్టిక్ కరెన్సీ చలామణిలో ఉన్నదన్న మల్హోత్రా.. అక్కడ 30 ఏండ్లు ఆ నోట్లు మన్నికగా ఉంటున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే అన్నీ అనుకున్నట్టు కుదిరితే దేశంలోనూ వచ్చే ఏడాది ప్లాస్టిక్ కరెన్సీ అందరి చేతుల్లో ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే ముందుగా తక్కువ డినామినేషన్లలోనే (రూ.10, 20, 50..) తీసుకొస్తామని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు కరెన్సీ త్వరగా చిరుగులు పడుతుండటం, వాటిని తిరిగి ముద్రించేందుకు అవుతున్న ఖర్చులు పెరుగుతుండటంతో ఎప్పట్నుంచో ప్లాస్టిక్ కరెన్సీ చలామణిని ఆర్బీఐ పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వచ్చే జూన్‌కల్లా సదరు నోట్లను అందుబాటులోకి తేనున్నారన్న అంచనా.
కీలక వడ్డీరేట్లు ఎక్కడివక్కడే
రెపోరేటును వరుసగా నాల్గో ద్రవ్య సమీక్షలోనూ ఆర్బీఐ యథాతథంగానే ఉంచింది. అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అన్నదానిపై సెంట్రల్ బ్యాంక్ వేచిచూసే ధోరణిని అనుసరించింది. ద్రవ్యోల్బణంపై ఓ అవగాహనకు వచ్చాకే.. దాని ఆధారంగా ద్రవ్య విధాన నిర్ణయాలను తీసుకోవచ్చని భావించింది. ఈ క్రమంలోనే మరొక్కసారి తటస్థ వైఖరిని అవలంబించింది. గవర్నర్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యులుగల ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ రెపోరేటును 5.25 శాతంగానే ఉంచాలని ఏకగ్రీవంగా తీర్మానించాయి. నిజానికి ఈ రెపోరేటు పెరిగితే బ్యాంకులు తమ రుణాలపైనా వడ్డీరేట్లను ఆ మేరకు పెంచేస్తాయి. దీనివల్ల గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణాలు భారమవుతాయి. రుణగ్రహీతల ఈఎంఐలు పెరుగుతాయి. ఇదే జరిగితే మార్కెట్లో అమ్మకాలు పడిపోయే అవకాశాలూ ఉంటాయి. అందుకే ఈసారి ద్రవ్యోల్బణం కంటే దేశ జీడీపీ వృద్ధికే ఆర్బీఐ ప్రాధాన్యతనిచ్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాబోయే ద్రవ్య సమీక్షల్లోనూ ఆర్థిక గణాంకాల ఆధారంగానే ఆర్బీఐ నిర్ణయాలుండొచ్చని చెప్తున్నారు.
యూపీఐ చార్జీలపై మల్హోత్రా మాట..
యూపీఐ లావాదేవీలపై చార్జీలను వసూలు చేయనున్నారా? అన్న ప్రశ్నకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బదులిస్తూ.. ‘ఇప్పుడప్పుడే స్పందించడం తొందరపాటే అవుతుంది. అయితే ప్రభుత్వం ఈ విషయంపై ఓ తుది నిర్ణయానికి రావాల్సి ఉన్నది. అయినా ఖర్చుల్ని ఎవరో ఒకరు భరించాల్సిందేగా. ఏం జరుగుతుందో వేచి చూద్దాం’ అన్నారు. దీంతో ఇక యూపీఐ సేవలు ఉచితంకాదని, ఫీజుల్ని బాదుతారన్న సంకేతాలైతే వస్తున్నాయి. మంగళవారం ఆర్థిక శాఖ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007కు సవరణలను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనివల్ల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్లు (ఎండీఆర్) మళ్లీ రాబోతున్నాయి. ప్రస్తు తం సెక్షన్ 10ఏ కింద జీరో ఎండీఆర్ నిబంధన అమల్లో ఉన్నది. చట్ట సవరణలతో ఇది రద్దవుతుంది. కాగా, గూగుల్ పే, ఫోన్‌పే తదితర యాప్స్ ద్వారా కొనుగోలుదారులు చేసే ఆన్లైన్ చెల్లింపులను బ్యాంకులు, పేమెంట్స్ సిస్టమ్ ప్రొవైడర్స్ ప్రాసెస్ చేస్తారు. ఇందుకుగాను ఆయా వ్యాపారులు వాటికి చెల్లించే ఫీజునే ఎండీఆర్ అంటారు. అయితే ఈ భారాన్ని వ్యాపారులు అంతిమంగా తమ కస్టమర్లపైనే వేస్తారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రూ.2 వేలకు మించిన లావాదేవీలపై 0.3-0.5 శాతం ఎండీఆర్‌ను అమలుపర్చే యోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం.
ద్రవ్య సమీక్ష ముఖ్యాంశాలు
- భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడితే డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడవచ్చు.
- ఈ ఆర్థిక సంవత్సరం రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతంగా, దేశ జీడీపీ 6.7 శాతంగా నమోదు కావచ్చు.
- ఎల్ నినో, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు, ప్రపంచ వాణిజ్య విధానాలతో సవాళ్లే.
- అర్బన్ సహకార బ్యాంకుల లైసెన్స్‌ల కోసం త్వరలో మార్గదర్శకాలు.
- తదుపరి సమీక్ష అక్టోబర్ 5-7. ఎవరేమన్నారు?

అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులతో దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిళ్లను కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచాలన్న ఆర్బీఐ నిర్ణయం తగ్గించగలదు. పశ్చిమాసియా సంక్షోభం, ఇంధన ధరల్లో ఒడిదుడుకులు, విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం, ఎల్ నినో ప్రభావం వంటివి సవాళ్లు విసురుతున్నా.. సెంట్రల్ బ్యాంక్ వివేకంతో వ్యవహరించింది.
-ఆర్థిక నిపుణులు, పరిశ్రమ వర్గాలు
ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) వడ్డీరేట్లు పెరుగుతాయన్న అంచనాలను తాజా నిర్ణయంతో ఆర్బీఐ చాలా గట్టిగా తోసిపుచ్చింది. ద్రవ్యోల్బణం, జీడీపీ గణాంకాలపై మరింత కచ్చితమైన అవగాహన ఏర్పడ్డాకే వడ్డీరేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఓ నిర్ణయానికి రావచ్చు.
-ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు
అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నడుమ దేశీయ నిర్మాణ రంగానికి ఆర్బీఐ నిర్ణయం భరోసా ఇచ్చింది.
-శేఖర్ పటేల్, క్రెడాయ్ అధ్యక్షుడు
ఆర్బీఐ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రాబోయే పండుగ సీజన్లో ఇండ్ల అమ్మకాలకు ఇది దోహదం చేయగలదు.
-ప్రవీణ్ జైన్, నరెడ్కో అధ్యక్షుడు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

