హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ): నోటీసులు ఇవ్వకుడానే నిర్మాణాలను కూల్చే అధికారం హైడ్రాకు ఉన్నదని.. చెరువులు, నాలాలు, రైల్వేలైన్లు తదితర చోట్ల ఆక్రమణలు తొలగించేటప్పుడు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఆక్రమణల వల్ల నష్టపోయామనుకుంటున్న బాధితులు సివిల్ లేదా క్రిమినల్ కోర్టులకు వెళ్లి చట్టపరమైన పరిష్కారాలను పొందాలని, పరిహారం తీసుకోవడానికి కోర్టుల ద్వారా అవకాశం ఉంటుందని సూచించారు. ఆదివారం సాయం త్రం ఎక్స్ వేదికగా నెటిజన్లు ఏర్పాటు చేసిన ముఖాముఖిలో పాల్గొన్న కమిషనర్ రంగనాథ్, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఎన్నారైలు తాము ఎక్కడో ఉండి బిల్డర్‌ను, రియల్టర్‌ను నమ్మి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నామని, హైడ్రా వచ్చి కూల్చివేస్తుంటే.. తాము ఎలా ముందుకు పోవాలని ఒక ఎన్నారై నెటిజన్ ప్రశ్నించారు. హెచ్ఎండీఏ లేక్స్‌లో ఎఫ్టీఎల్కు సంబంధించిన మ్యాప్స్ ఉన్నాయని, వాటిని ప్రామాణికంగా తీసుకొని కొనుగోలు చేయాలని, లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్‌గా రెండు మూడు నెలల్లో ఎఫ్టీఎల్లను పూర్తిస్థాయిలో నిర్ధారిస్తామని, అయితే కొనుగోలు సమయంలో అన్నీ సక్రమంగా చూసుకొని కొనాలి తప్ప అక్రమ భూములను కొంటే తర్వాత జరిగే వాటికి బాధ పడాల్సి వస్తుందని చెప్పారు.
పూలు, రాళ్లు పడుతాయని తెలుసు
హైడ్రా ఏర్పాటైనప్పుడే తమపై పూలు, రాళ్లు పడుతాయని ఊహించామని, అయితే ప్రజలకు ఎఫ్‌టీఎల్‌పై అవగాహన కల్పించడంలో సక్సెస్ అయ్యామని రంగనాథ్ తెలిపారు. హైడ్రాకు అన్ని శాఖలతో సమన్వయం ఉన్నా, అధికారాలు వచ్చినా కూల్చివేతల బాధ్యత రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖలదేనని, వాటికి హైడ్రా సహకారం మాత్రమే అందిస్తుందని చెప్పారు. ఎఫ్టీఎల్ నిర్ధారణ విషయంలో హైడ్రా ఎన్ఆర్ఎస్సీతో ఎంవో యూ కుదుర్చుకున్నదని, రికార్డులు, మ్యాప్స్, సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్స్, గ్రామ నక్షాల ఆధారంగా చెరువుల హద్దులు నిర్ణయించనున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో చాలాచోట్ల చెరువుల ఎఫ్టీఎల్లను మార్చారని, ఎన్ కన్వెన్షన్ వద్ద చెరువులో మట్టిపోయడంతో నీటి ప్రవా హం అలుగు పరిస్థితి మారిందని, దీంతో ఎఫ్టీఎల్ కూడా మారుతుందని, అదే విధంగా చాలా చెరువుల్లో ఎఫ్టీఎల్లు మారినట్టు గుర్తించామని వివరించారు.
ఒవైసీ విద్యాసంస్థలో పేదవిద్యార్థులు..
ఒవైసీ కాలేజీ ఆక్రమణలపై అడిగిన ప్రశ్నకు రంగనాథ్ సమాధానమిస్తూ సూరం చెరువు ఆక్రమణకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారని, కానీ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్)లు ఉండటం వల్ల ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారని తెలిపారు. ఒవైసీ విద్యాసంస్థలో కేజీ నుంచి పీజీ వరకు పదివేల మంది వరకు పేద ముస్లిం పిల్లలు చదువుతున్నారని, కళాశాల సామాజిక కోణం నేపథ్యంలో హైడ్రా ఆలోచిస్తున్నదని చెప్పారు. ప్రజావాణిలో వేల ఫిర్యాదులు వస్తున్నాయని, తెల్లవారుజామునుంచే లైన్లలో టోకెన్ల కోసం నిలబడుతున్నారని, వారి ఫిర్యాదులకు న్యాయం చేసేందుకు తాము వెంటవెంటనే పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. భూ ఆక్రమణలపై ఫిర్యాదు వస్తే దానిపై ఒక అధికారితో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేస్తామని, డాక్యుమెంట్లు పరిశీలించి, మాట్లాడి కూల్చివేతలు చేస్తున్నామని చెప్పారు. సోమవారం ప్రజావాణి, మంగళవారం టెక్నికల్ డెవలప్మెంట్, బుధ, గురువారాల్లో క్షేత్రస్థాయి పరిశీలన, శుక్రవారం మీటింగ్స్, శనివారం వర్క్‌షాపులతో హైడ్రా కార్యాచరణ రూపొందించుకున్నదని తెలిపారు.
సీఎం నాపై నమ్మకంతో అప్పగించారు
తాను వరంగల్ కమిషనర్‌గా పనిచేసినప్పుడు ఎవరికీ భయపడకుండా రాజకీయ నాయకులను సైతం భూ ఆక్రమణల్లో అరెస్ట్ చేసినందుకు సీఎం రేవంత్ తనపై నమ్మకముంచి హైడ్రాను అప్పగించారని రంగనాథ్ తెలిపారు. హైడ్రా పేదల గుడిసెలు కూల్చేస్తున్నదని ప్రచారం చేశారని, తమకు, మూసీకి సంబంధం లేకున్నా ఒక వర్గం పనిగట్టుకుని ప్రచారం చేసిందని చెప్పారు.