Tejashwi Yadav : అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో ఓటర్ల జాబితా (Voters list) ను సవరించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఇటీవల ప్రకటించింది. దీనిపై బీహార్లో ప్రతిపక్ష మహాకూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ఓటర్ల జాబితా సవరణ దేనికని, రెండు నెలల్లో జాబితాను సవరించడం సాధ్యమా..? అని అర్జేడీ (RJD) కీలక నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) ప్రశ్నిస్తున్నారు.
తాము ఈ నెల 5న ఎన్నికల సంఘాన్ని కలిసి అతి తక్కువ సమయంలో ఎన్నికల జాబితాను సవరించడంతో వచ్చే సమస్యలపై సందేహాలు లేవనెత్తామని తేజస్వి యాదవ్ తెలిపారు. కానీ ఎన్నికల సంఘం నుంచి తమకు ఇంతవరకు ఎలాంటి వివరణ రాకపోవడం ఆందోళనకరమైన విషయమని అన్నారు. బీహార్ ఎన్నికల సంఘం కేవలం పోస్టాఫీస్లా పనిచేస్తున్నదని, తమ సందేహాలకు సమాధానం ఇచ్చే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘం దగ్గర లేదని విమర్శించారు.
ఎన్నికల సంఘం ఆదివారం మూడు పరస్పర విరుద్ధమైన సూచనలు చేసిందని, దీన్నిబట్టి పోల్ బాడీ కన్ఫ్యూజన్లో ఉందనే విషయం స్పష్టమవుతోందని తేజస్వియాదవ్ చెప్పారు. ఎన్నికల సంఘం చేస్తున్న పరస్పర విరుద్ధ సూచనలు, పత్రికా ప్రకటనలు తమ కూటమి పార్టీలను ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. తమ సందేహాలకు ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.