MLC Kavitha : పోలీసులు స్వర్ణకారులను వేధించడం మానుకోవాలని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు (Suicides) చేసుకోవద్దని కోరారు. బంగారం వృత్తి చేసుకునే వారికి సర్కారు రుణాలు ఇవ్వాలని, కార్పొరేట్ సంస్థల (Corporate companies) తో పోటీపడేలా విశ్వకర్మల (Vishwakarmas) కు చేయూతనివ్వాలని డిమాండ్ చేశారు.
ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న స్వర్ణకారుల ఆత్మహత్యలు కలిచి వేస్తున్నాయని కవిత ఆవేదన వ్యక్తంచేశారు. విశ్వకర్మ వృత్తుల వారు యావత్ దేశానికే ఊపిరి పోస్తున్నారని, కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో ఆయా వృత్తులకు ఆదరణ తగ్గిపోయిందని అన్నారు. క్రమేణ వృత్తిపని చేస్తున్న వారికి ఉపాధి లేకుండా పోతోందని, వారి జీవనం నడవడమే ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వెలిబుచ్చారు.
మన దేశంలో బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, నగలను ఎంతో పవిత్రంగా చూస్తారని, కేవలం స్వర్ణకారులే కాకుండా ఇతర కులాల వారు కూడా ఈ వృత్తిని ఉపాధిగా మార్చుకున్నారని, మహిళగా మెట్టెలు, మంగళసూత్రాలు చేయించాలంటే స్వర్ణకారుడి దగ్గరికి వెళ్తామే తప్ప పెద్దపెద్ద షాపులకు వెళ్లమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. భారతీయులు పవిత్రంగా భావించే బంగారు, వెండి ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు.
దొంగ బంగారం కొన్నారని పోలీసులు స్వర్ణకారులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఆ బంగారం అమ్మిన దొంగలను మాత్రం పట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక కొందరు స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదని అన్నారు. తాను నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో స్వర్ణకారులను పోలీసులు ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకున్నానని గుర్తుచేశారు.
స్వర్ణకారులను వేధింపులకు గురిచేస్తున్న 411 చట్టానికి సవరణలు చేయాలని డిమాండ్ చేస్తున్నానని, ఏపీలోనూ 411 చట్టం కింద కేసులు పెట్టి స్వర్ణకారులను వేధిస్తున్నారని కవిత తెలిపారు. ఎమ్మెల్సీగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా, బీసీల కోసం ఉద్యమిస్తున్న నాయకురాలిగా ఈ చట్టం సవరణ కోసం పోరాడుతానని ఆమె హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ హామీ ఇచ్చినట్టుగానే స్వర్ణకారులతోపాటు అన్ని చేతివృత్తిదారులను ఆదుకునే చర్యలు చేపట్టాలని సూచించారు.
అప్పుడే చేతివృత్తులవారు కార్పొరేట్ సంస్థలతో ధీటుగా నిలబడగలుగుతారని కవిత అన్నారు. కొందరు పోలీసుల పేరు చెప్పి స్వర్ణకారులను వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. అలాంటి నకిలీ పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లేదా సమీపంలోని నాయకులను ఆశ్రయించాలని సూచించారు. అంతే తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదని చెప్పారు. ఒక సోదరిగా మిమ్మల్ని కోరుతున్నానని, ఆత్మహత్యలు చేసుకోవద్దని అన్నారు.