రాంచీ: ఒక వ్యక్తికి కాబోయే భార్య అనుమానాస్పదంగా మరణించింది. ఆ మహిళ తండ్రి ఫిర్యాదుపై పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అయితే అంత్యక్రియలకు ముందు కాబోయే భార్య మృతదేహాన్ని ఆ వ్యక్తి పెళ్లాడాడు. (man marries fiancee’s body) జార్ఖండ్‌లోని గిరిడిహ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మనీష్ ముర్ము అనే వ్యక్తికి నాలుగు నెలల కిందట ఒక యువతితో నిశ్చితార్థం జరిగింది. వారిద్దరికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. అయితే కాబోయే భార్యను మనీష్ తన ఇంటికి తీసుకొచ్చాడు. కొన్ని నెలలుగా ఆమెతో కలిసి సహజీవనం చేస్తున్నాడు.
కాగా, మే 15న శుక్రవారం ఆ మహిళ ఆరోగ్యం క్షిణించినట్లు ఆమె తల్లిదండ్రులకు మనీష్ సమాచారం ఇచ్చాడు. దీంతో వారు అతడి ఇంటికి చేరుకున్నారు. ఆ మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
అయితే మనీష్ తన కుమార్తెను బలవంతంగా అతడి ఇంట్లో ఉంచాడని, ఆమెను దారుణంగా కొట్టాడని, పెళ్లి చేసుకోవడం తప్పించుకునే ఉద్దేశంతో బలవంతంగా విషం తాగించాడని ఆ మహిళ తండ్రి ఆరోపించాడు. విష ప్రయోగం కారణంగానే తన కుమార్తె మరణించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మనీష్‌ను అరెస్ట్ చేశారు.
మరోవైపు పోస్ట్‌మార్టం తర్వాత మహిళ మృతదేహాన్ని తీసుకునేందుకు ఇరు కుటుంబాలు నిరాకరించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆమె మృతదేహాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం రాత్రంతా అక్కడే ఉంచారు.
అయితే శనివారం ఉదయం మహిళ మృతదేహాన్ని మనీష్ గ్రామానికి పోలీసులు తరలించారు. అతడి కుటుంబ సభ్యుల కోరిక మేరకు పోలీస్ భద్రత మధ్య అతడ్ని అక్కడకు తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో కాబోయే భార్య మృతదేహాన్ని మనీష్ పెళ్లాడాడు. ఆమె పాపిడిలో సింధూరం దిద్దటంతో పాటు ఇతర వివాహ సంప్రదాయాలను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇరు కుటుంబాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా పోలీసులను మోహరించారు.