భోపాల్: జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద ఒక యువకుడిపై తప్పుడు కేసు నమోదు చేశారు. ఏడాదిపైగా జైలులో ఉంచారు. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు జిల్లా కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.2 లక్షల జరిమానా విధించింది. (High Court Fines Collector) ఆ కలెక్టర్‌పై ధిక్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2024 సెప్టెంబర్‌లో ఇసుక మాఫియా కేసులో నిందితుడైన నీరజ్కాంత్ ద్వివేదికి బదులుగా రైతు హిరామణి కుమారుడు సుశాంత్‌పై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద చర్యలు తీసుకోవాలని షాడోల్ జిల్లా కలెక్టర్ కేదార్ సింగ్ తప్పుగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆ యువకుడ్ని అరెస్ట్ చేసి ఏడాదిపైగా జైలులో ఉంచారు.
కాగా, రైతు హిరామణి దీనిపై మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ వివేక్ అగర్వాల్, జస్టిస్ ఏకే సింగ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. షాడోల్ కలెక్టర్ జారీ చేసిన ఎన్ఎస్ఏ ఉత్తర్వులో తీవ్రమైన విధానపరమైన లోపాలు ఉన్నాయని గుర్తించింది. విచారణ సందర్భంగా క్లరికల్ మిస్టేక్ జరిగిందని కలెక్టర్ కేదార్ సింగ్ అంగీకరించారు. దీంతో ఉత్తర్వులో ఏమున్నది అన్నది చూడకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడం, గుడ్డిగా సంతకాలు చేయడంపై కోర్టు ఆగ్రహించింది. అలాగే ఎన్ఎస్ఏ చట్టం దుర్వినియోగంపై మండిపడింది.
మరోవైపు చట్టవిరుద్ధంగా నిర్బంధించిన బాధితుడు సుశాంత్‌కు వ్యక్తిగతంగా రూ.2 లక్షలు పరిహారంగా చెల్లించాలని కలెక్టర్ కేదార్ సింగ్‌ను ధర్మాసనం ఆదేశించింది. కేసును తప్పుదారి పట్టించే విధంగా అఫిడవిట్ దాఖలు చేసినందుకు కలెక్టర్‌తో పాటు, ఆ ఉత్తర్వును తనిఖీ చేయకుండా అమలు చేసిన అదనపు ప్రధాన కార్యదర్శి (హోం) ఎస్ఎస్ శుక్లాకు ధిక్కార నోటీసు జారీ చేయాలని, వారిద్దరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 25కు వాయిదా వేసింది.
Also Read:
BJP Leader Phool Joshi | బీజేపీ నాయకురాలి ‘సెక్స్ రాకెట్’ గుట్టురట్టు.. ఆర్జేడీ మండిపాటు
Teen Set On Fire, Man Hanging | నిప్పంటించుకుని యువతి మృతి.. సమీపంలోని ఇంట్లో వ్యక్తి సూసైడ్
Watch: ఎయిర్‌పోర్టులో ఎదురుపడిన తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్.. తర్వాత ఏం జరిగిందంటే?