Ladakh : కేంద్రపాలిత ప్రాంతమైన లఢక్‌లో నివసిస్తున్న ప్రజల భాష, సంస్కృతి, రాజ్యాంగ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారి స్థానికత, రిజర్వేషన్ల అంశంపై అధికారిక ప్రకటన చేసింది. అక్కడ 85 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించింది. 15 ఏళ్లకు మించి ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారు, కనీసం 7 ఏళ్లపాటు అక్కడ చదువుకొని, 10 లేదా 12వ తరగతి పరీక్షలకు హాజరై ఉంటే స్థానికులుగా గుర్తించాలని నిర్ణయించింది.
అంతేకాకుండా లఢక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో మూడులో ఒక వంతు సీట్లు మహిళలకే కేటాయించనున్నారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్-370ని 2019లో రద్దు చేసిన తర్వాత.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. జమ్ముకశ్మీర్, లఢక్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో తమ భాష, సంస్కృతి, హక్కుల పరిరక్షణ కోసం స్థానికంగా నిరసనలు జరుగుతున్నాయి.
దాంతో స్థానికుల ప్రయోజనాలు లక్ష్యంగా కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. లఢక్ ప్రజల స్థానికత నిర్ధారణకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ నేతృత్వంలో 2023 జనవరిలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఈ బృందం స్థానికుల సమస్యలను తెలుసుకొని ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేసింది. మరోవైపు ఇవే డిమాండ్లపై పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా 2024 అక్టోబర్‌లో ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టింది.