Sharmistha Panoli : కలకత్తా హైకోర్టు (Calcutta High Court) లో 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని (Law student), ఇన్స్టా ఇన్ఫ్లూయెన్సర్ శర్మిష్ఠ పనోలి (Sharmistha Panoli) కి చుక్కెదురైంది. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దేశంలో వాక్ స్వాతంత్య్రం (Freedom of speech) ఉన్నదని, అయితే అది ఏ ఒక్కరి మత ప్రయోజనాల (Religious sentiments) ను దెబ్బతీయడాన్ని అనుమతించదని వ్యాఖ్యానించింది.
కేసు తదుపరి విచారణను కోర్టు జూన్ 5కు వాయిదా వేసింది. ఆరోజు కేసుకు డైరీని సబ్మిట్ చేయాలని కలకత్తా పోలీసులను ఆదేశించింది. కాగా శర్మిష్ఠ పనోలి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఓ వీడియోను తన ఇన్స్టా ఖాతాలో పోస్టు చేసింది. ఆపరేషన్ సింధూర్పై బాలీవుడ్ ప్రముఖులు స్పందించకపోవడాన్ని ఆ వీడియోలో ప్రశ్నించింది. అయితే ఆ వీడియో ఓ మతాన్ని అవమానించేలా ఉందని విమర్శలు రావడంతో ఆమె డిలీట్ చేసింది. తన వీడియో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరింది.
అయినా కలకత్తా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ట్రయల్ కోర్టులో హాజరుపర్చగా జూన్ 13 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పనోలి తరఫు న్యాయవాది కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ కలకత్తా హైకోర్టు కూడా ట్రయల్ కోర్టు తీర్పునే సమర్థించింది. పనోలీకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.