Prashant Kishor : జన్ సూరజ్ పార్టీ (Jan Suraaj Party) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) పై బీహార్ మంత్రి, జేడీయూ సీనియర్ నాయకుడు అశోక్ చౌధరి (Ashok Choudhary) పరువునష్టం దావా (Defamation suit) వేశారు. తనపై అసత్యపు ఆరోపణలు చేసి, తన పరువు తీసినందుకు దావా వేశానని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణలైనా చెప్పాలి లేదంటే తనపై చేసిన ఆరోపణలు నిజమేనని రుజువైనా చేయాలని డిమాండ్ చేశారు.
అశోక్ చౌధరి గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తన కుమార్తె శాంభవికి ఎంపీ టికెట్ కోసం లోక్‌జన శక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు లంచం ఇచ్చాడని ప్రశాంత్ కిషోర్ ఇటీవల ఆరోపించారు. శాంభవి ప్రస్తుతం సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి లోక్‌జన శక్తి పార్టీ ఎంపీగా ఉన్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఆరోపణలను అశోక్ చౌధరి తిప్పికొట్టారు. తప్పుడు ఆరోపణలు చేసిన ప్రశాంత్ కిశోర్ తనకు క్షమాపణలు చెప్పకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్తానని హెచ్చరించారు.