టెల్ అవీవ్: ఇరాన్‌పై శనివారం ప్రారంభించిన దాడులను ఇజ్రాయెల్ ఆదివారం కూడా కొనసాగించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఇరాన్ నేతలు, ఆ దేశ మిలిటరీ లక్ష్యంగా తమ దాడులు నిరంతరం కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. కాగా, టెహ్రాన్‌లో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రదేశంలో పెద్ద పేలుడు సంభవించిందని, ఆ ప్రదేశమంతా దట్టమైన పొగ అలుముకుందని స్థానికులు తెలిపారు. అమెరికా- ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన తర్వాత 200 మందికి పైగా ఇరాన్ పౌరులు మరణించారని అధికారులు పేర్కొన్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నడిబొడ్డును లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఆదివారం వైమానిక దాడి చేయడంతో నగరం భయంతో వణికింది.
భారీ శబ్దంతో భూమిని కుదిపేసిన ఈ దాడితో ఆకాశం నిండా దట్టమైన పొగ అలుముకుంది. తమ సైన్యం ఇరాన్‌లోని లక్ష్యాలను సులభంగా ఢీకొట్టినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ ఆపరేషన్ కోసం నెలల తరబడి అమెరికాతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపింది. తమ వైమానిక దళ పైలట్లు ఇరాన్‌లోని వందలాది లక్ష్యాలపై విజయవంతంగా దాడి చేశారని ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ ఈయల్ జమీర్ ఒక ప్రకటనలో తెలిపారు. దాడికి ముందు ఇరాన్ మిలిటరీ, ప్రభుత్వ చిహ్నాలు, ఇంటెలిజెన్స్ లక్ష్యాల గురించి తమ సైనికులకు శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. కాగా, దక్షిణ ఇరాన్‌లోని ఒక బాలికల పాఠశాలపై శనివారం జరిపిన దాడిలో 165 మంది మరణించారని, డజన్ల కొద్దీ పౌరులు గాయపడ్డారని ఒక అధికారి తెలిపారు.