Rahul Gandhi | హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోమవారం వికారాబాద్ జిల్లాకు రానున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో జరుగుతున్న ఏపీ, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరు అవుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రాహుల్ చేరుకుంటారు. అక్కడ సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి సీఎంతో కలిసి అనంతగిరి వెళ్తారు. ఈ నెల 16న జరగనున్న రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
హైదరాబాద్, మార్చి1 (నమస్తే తెలంగాణ) : కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చిన హామీలను అమలుచేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి బీసీల తరఫున బహిరంగ లేఖ రాశారు. 42 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాలని, త్వరలో భర్తీ చేయబోయే రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీసీకి, రెండోది ఎస్సీ లేదా ఎస్టీకి కేటాయించాలని కోరారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో అగ్రకుల ఆధిపత్య వర్గాల దాడిలో పసికందు మరణించిన విషయంలో జోక్యం చేసుకొని నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని రాహుల్‌గాంధీని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కబోదని హెచ్చరించారు.