న్యూఢిల్లీ, జూలై 28 : హిందుస్థాన్ యునిలీవర్ (హెచ్యూఎల్) మరోసారి తన ఉత్పత్తుల ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నమోదైన ద్రవ్యోల్బణంతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికం నాటికి ధరల సూచీ 2-5 శాతం వరకు పెరిగే అవకాశం ఉండటంతో ధరల పెంపు అనివార్యమనిపిస్తున్నదని హెచ్యూఎల్ సీఈవో, ఎండీ ప్రియా నాయర్ తెలిపారు.
ఇప్పటికే 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఉత్పత్తుల ధరలను 2-5 శాతం వరకు సవరించిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు ధరలు భగ్గుమన్నాయని, దీంతో సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి ఇప్పటికే కసరత్తును ప్రారంభించినట్టు చెప్పారు. వీటికితోడు వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, ఎల్ నినో ప్రభావంతో అమ్మకాలు పడిపోయే ప్రమాదం ఉన్నదని ఆమె హెచ్చరించారు.