మొగుళ్లపల్లి, జూలై 28 : గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదని గ్రామ పంచాయతీ కార్యాలయానికి మాజీ సర్పంచ్ తాళం వేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లిలో మంగళవారం చోటుచేసుకున్నది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ దంపతులు బెల్లంకొండ మాధవి, శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ.. అబివృద్ధి పనులకు సంబంధించి తమకు రావాల్సిన రూ.14 లక్షల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ పంచాయతీలో నిధులున్నా పెండింగ్ బిల్లులు చెల్లించకుండా తమను ఇబ్బందిపెడుతున్నట్టు తెలిపారు. తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసినట్టు చెప్పారు. అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డులు పంపకపోవడం వల్లే బిల్లులు రాలేదని, పరిస్థితి తాళం వేసే వరకు వెళ్లిందని పేర్కొన్నారు.