డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చార్ధామ్ యాత్రను మంగళ, బుధవారాల్లో తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రతికూల వాతావరణం తొలగిపోయి, రహదారి మార్గాలు సురక్షితమని తేలేవరకు యాత్రను పునరుద్ధరించబోమని గర్వాల్ డివిజనల్ కమిషనర్ తెలిపారు.
నిరంతర వర్షాల కారణంగా కేదార్నాథ్ జాతీయ రహదారిపై మున్‌కటియా ప్రాంతంలో కొండచరియలు, బండరాళ్లు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్‌సింగ్ రాజ్వార్ మాట్లాడుతూ రహదారి పలుచోట్ల దెబ్బతినే అవకాశం ఉందని, ప్రయాణికులను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేసి, నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. డెహ్రాడూన్ ఎస్పీ ప్రమేంద్ర మాట్లాడుతూ జిల్లా పోలీసులు హై అలర్ట్‌లో ఉన్నారని తెలిపారు.