మంగళవారం 19 జనవరి 2021
National - Dec 21, 2020 , 12:38:08

త‌మిళ పార్టీల‌తో పొత్తు ఉండ‌దు : క‌మ‌ల్ హాస‌న్‌

త‌మిళ పార్టీల‌తో పొత్తు ఉండ‌దు : క‌మ‌ల్ హాస‌న్‌

చెన్నై : వ‌చ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో త‌మిళ‌నాడు అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయా పార్టీలు త‌మ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించాయి. అయితే మ‌క్క‌ల్ నిధి మ‌య్యమ్‌(ఎంఎన్ఎం) పార్టీ అధినేత క‌మ‌ల్ హాస‌న్ సోమ‌వారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మిళ పార్టీల‌తో ఎలాంటి పొత్తు ఉండ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఇటీవ‌లే ఆయన ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు. తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నది త్వరలో స్పష్టం చేస్తానని కమల్‌ తెలిపారు.

ఈ మ‌ధ్య జ‌రిగిన బీహార్ ఎన్నిక‌ల్లో 5 స్థానాల్లో గెలిచి ఊపు మీదున్న మ‌జ్లిస్ పార్టీ.. ఇప్పుడు త‌మిళ‌నాడు వైపు చూస్తోంది. దీనికోసం క‌మ‌ల్‌హాస‌న్‌తో చేతులు క‌ల‌ప‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఒవైసీ. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 25 లోపు స్థానాల్లో పోటీ చేయాల‌ని భావిస్తున్న ఎంఐఎం.. క‌మ‌ల్ నేతృత్వంలోని మ‌క్క‌ల్ నీది మ‌య్య‌మ్ పార్టీతో చేతులు క‌లిపే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.