Uttarakhand | ఉత్తరాది రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.
ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand)లో కుంభవృష్టి
కురుస్తోంది. ఎడతెరిపి లేని భారీ వర్షంతో రెండు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. కొండ
రాష్ట్రాల్లోని పలు నదులు పొంగి పొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తుతోంది. రోడ్లు,
వంతెనలు కొట్టుకుపోయాయి. పలు చోట్ల ఇళ్లు పేకమేడల్లా కూలి వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. చాలా చోట్ల కొండచరియలు విరిగిపడటంతో పలు రోడ్లను అధికారులు మూసివేశారు. ఈ వరదల కారణంగా రెండు రాష్ట్రాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. మొత్తం 88 మంది ప్రాణాలు కోల్పోగా.. రూ.10వేల కోట్లకు పైనే ఆస్తి నష్టం వాటిల్లింది.
ఇదిలా ఉండగా.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ
(IMD) హెచ్చరించింది. ఈ మేరకు ఐదు జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని పౌరి, డెహ్రాడూన్,
నైనిటల్, చంపావత్, భాగేశ్వర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు చండీగఢ్ దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. పంజాబ్‌లోని మొహాలీ,
హర్యానాలోని పంచకుల తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
రాబోయే రెండు రోజుల్లో పంజాబ్, హర్యానాలో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
హిమాచల్ అతలాకుతలం
ఇప్పటికే కుండపోత వర్షాలతో అతలాకుతలమైన హిమాచల్‌ప్రదేశ్‌కు (Himachal Pradesh) మరో ముప్పు పొంచి ఉంది. నేటి నుంచి ఈ నెల 24 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు (Very heavy rain) కురుస్తాయని వాతావరణ శాఖ (MET) హెచ్చరించింది. దీంతో ఈ నెల 22 నుంచి 24 వరకు ఆరెంజ్ అలర్జ్, నేడు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక భారీ వర్షాలతో ఛంబా (Chamba), మండి (Mandi) జిల్లాలను ఆకస్మిక వరదలు ముంచెత్తే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల వల్ల కొండ చరియలు విరిపడుతాయని, నదులు, వాగుల్లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
Also Read..