కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జాకోరుగా మారిపోయింది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని జనావాసాలపై కన్నేసింది. సర్వేలు, తాఖీదులు,
కూల్చివేతలు, స్వాధీనాల పేరుతో హైదరాబాద్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. మూసీ సుందరీకరణ, ఫోర్త్ సిటీ, హిల్ట్ పాలసీ,గాంధీ సరోవర్… పేరు ఏదైనా ఆ పథకాల వెనుక ప్రభుత్వ పెద్దల రియల్ ఎస్టేట్ దందా దాగి ఉన్నదనే అనుమానాలు బలపడుతున్నాయి.
కాంగ్రెస్ పాలకులు రాష్ట్ర ఆదాయాన్ని పెంచాల్సిన మార్గాలు అన్వేషించకుండా ప్రభుత్వ భూములను ఎడాపెడా వేలం వేయడం నిత్యకృత్యమైపోయింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములను రాత్రికి రాత్రి కబళించాలని చూసిన ప్రభుత్వ పెద్దలు, హైకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గక తప్పలేదు. ఇక ఫార్మాసిటీకి సేకరించిన 14 వేల ఎకరాల భూమిని ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చేసింది. పారిశ్రామిక వాడల భూముల కోసం హిల్ట్ పాలసీ తెచ్చింది. ఇప్పుడు గాంధీ సరోవర్ పేరుతో మరో కొత్త ప్రాజెక్టును ప్రజల ముందుకు తీసుకొచ్చింది.
మూసీ నది అందంగా ఉండాలని, కాలుష్యం, దుర్వాసన లేని నదీ జలాలు నిరంతరం ప్రవహించాలని అందరికీ ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం సుందరీకరణకు ముందు చేపట్టవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. మూసీ నీటిని శుద్ధి చేయడానికి అవసరమైన ప్లాంట్లు నెలకొల్పాలి. పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనాలు, వ్యర్థాలు, డ్రైనేజీ కలవకుండా నియంత్రించాలి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను గోదావరి నీళ్లతో నింపి ఏడాది పొడవునా ప్రవహించేలా ప్రణాళికలు రూపొందించాలి. ఒకవేళ మురికివాడల్లో నివసించే ప్రజలను ఖాళీ చేయించాల్సి వస్తే, వారికి ఆమోదయోగ్యమైన, ప్రత్యామ్నాయ గృహ సౌకర్యాన్ని కల్పించాలి. ఆ తర్వాత మాత్రమే ప్రభుత్వం అడుగు ముందుకేయాలి.
కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించింది. నదీ జలాల శుద్ధి కోసం 38 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను పూర్తిచేసి, మరో 94 ప్లాంట్ల పనులను 80 శాతం పూర్తి చేసింది. కొండపోచమ్మ సాగర్ నుంచి 30 టీఎంసీల నీళ్లను ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు తరలించే ప్రణాళిక రూపొందించింది.
మూసీకి ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూముల్లో సుందరీకరణ పనులు చేపట్టింది. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నది. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నది. భూములు ఇస్తారా చస్తారా అన్నట్టు వ్యవహరిస్తున్నది. నదీ గమన వైశాల్యాన్ని గుర్తించి స్థిరీకరించకుండా సంబంధం లేని దూరప్రాంతాల్లోనూ సర్వే నిర్వహిస్తున్నది.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ సుందరీకరణ అంశంపై మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు 15 టీఎంసీలు, మూసీ ప్రక్షాళనకు 5 టీఎంసీల గోదావరి జలాలు తరలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ జలాలు కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కొండపోచమ్మ సాగర్ నుంచి తరలిస్తున్న విషయాన్ని మాత్రం దాచి పెట్టారు. ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ మొదలుకొని కరెంట్, నల్లా, రోడ్డు, డ్రైనేజీ, పారిశుధ్య నిర్వహణ వంటి అనుమతులతో దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజలపై కాంగ్రెస్ సర్కార్ హైడ్రాను ఉసిగొల్పడం తప్ప ఉభయ తారకమైన పరిష్కారాన్ని ఏనాడూ ఆలోచించలేదు. హైడ్రా చర్యలపై న్యాయస్థానాలు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా, ఆగ్రహం వ్యక్తం చేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం బాధాకరం. కాంగ్రెస్ పాలకులు రాష్ట్ర ఆదాయాన్ని పెంచాల్సిన మార్గాలు అన్వేషించకుండా ప్రభుత్వ భూములను ఎడాపెడా వేలం వేయడం నిత్యకృత్యమైపోయింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములను రాత్రికి రాత్రి కబళించాలని చూసిన ప్రభుత్వ పెద్దలు, హైకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గక తప్పలేదు. ఇక ఫార్మాసిటీకి సేకరించిన 14 వేల ఎకరాల భూమిని ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చేసింది. పారిశ్రామికవాడల భూముల కోసం హిల్ట్ పాలసీ తెచ్చింది. ఇప్పుడు గాంధీ సరోవర్ పేరుతో మరో కొత్త ప్రాజెక్టును ప్రజల ముందుకు తీసుకొచ్చింది.
హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ ప్రాంతంలో ఉన్న బాపూఘాట్ వద్ద ఈసీ, మూసీ నదులు కలిసే చోట గాంధీజీ భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అక్కడికి ఎగువన మూసీ, ఈసీ నదులపై నిర్మించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ వరకు మధ్య గల 21 కిలోమీటర్ల నదుల పరీవాహక ప్రాంతాలను కలిపి గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ మేరకు అక్కడక్కడ ఉన్న రక్షణ శాఖ భూములు అప్పగించాలని ఆ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. వాస్తవానికి బాపూఘాట్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ వరకు ఉన్న ముక్కోణ ప్రాంత మధ్య భూములన్నీ అత్యంత విలువైనవే. ఆ ప్రాంతాల్లో గజం ధర లక్షల్లో ఉంటుంది. ప్రభుత్వ భూములను వేలం వేసిన క్రమంలో ఆ ప్రాంతాల్లో ఎకరా వంద నుంచి రూ.200 కోట్ల వరకు పలికింది. ఆ వేలం పాటలో పలికిన ధరలో పోల్చుకున్నప్పుడు ప్రభుత్వం తమ భూములకు మాత్రం నామమాత్రపు పరిహారం విలువ కట్టడం అన్యాయమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా నివసిస్తున్న తాము ఎక్కడికి వెళ్లాలని నిలదీస్తున్నారు. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ వల్ల భూములు, నివాసాలు కోల్పోతామన్న ఆందోళనతో ఇప్పటికే ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఉద్యమిస్తున్నారు.
ప్రజలు ఏ పథకం గురించి ప్రశ్నించినా, ఉద్యోగులు బకాయిలు అడిగినా, ఉద్యోగ విరమణ చేసిన వాళ్లు బెనిఫిట్స్ అడిగినా వేదిక ఏదైనా రేవంత్‌రెడ్డి ఒక్కటే మాట చెప్తున్నారు.నన్ను కోసినా పైసలు లేవు. ఆదాయం అంతా అప్పుల మిత్తీలకే సరిపోతున్నది. సాయం కోసం ఢిల్లీకి పోతే చెప్పులెత్తుకుపోయే వాడిని చూసినట్టు చూస్తున్నారు అని చేతులెత్తేస్తున్నారు. కానీ లక్షన్నర కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేస్తామని, వేల కోట్ల రూపాయలతో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేపడుతామని హడావుడి చేస్తున్నారు.
ప్రజలకు ఇవ్వడానికి పైసల్లేవంటూ చెప్పుకొస్తున్న రేవంత్‌రెడ్డి, మూసీ సంబంధిత ప్రాజెక్టుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించడం వెనుక అంతరార్థం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమ భూములను కబళించి, కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలే కుట్రలు చేస్తే ఎలా అని నిలదీస్తున్నారు. కేసీఆర్ హయాంలో సచివాలయ సమీపంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా నిర్మించిన విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు. అంతపెద్ద విగ్రహం, చుట్టుపక్కల వివిధ అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ ఒక్క అడుగు కూడా ప్రైవేట్ స్థలం సేకరించలేదని, మొత్తం ప్రభుత్వ భూమిలోనే నిర్మించారని గుర్తుచేస్తున్నారు. దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు గుజరాత్‌లోని వడోదరా నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో నిర్జన ప్రదేశంలో నర్మదా నదీగర్భంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నిర్మించారని చెప్తున్నారు. అంతేకాకుండా తమిళనాడులో తిరువళ్లువర్ విగ్రహం సముద్రం మధ్య కొండపై ఉన్నదని ఉదహరిస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా మహా విగ్రహాలు ఎన్నో ఉన్నాయని, అవి నెలకొల్పే క్రమంలో ప్రజలు నిరాశ్రయులు కాలేదని, బాధాతప్త హృదయాలతో ఎవరూ తమ ఇండ్ల నుంచి, భూములు వదిలి నిష్క్రమించలేదని గుర్తుచేస్తున్నారు.
మహాత్మా గాంధీ అంటే అందరికీ గౌరవమే. ఆయన చితాభస్మం కలిపిన బాపూజీ ఘాట్ మూసీ, ఈసీ నదుల సంగమం పవిత్రమైనదే. అయితే గాంధీజీ మరణానంతరం ఆయన అస్థికలు చితాభస్మం కలిపిన నదుల సమీప ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు ఏవీ లేవు. కొన్నిచోట్ల ఉన్నా అవి దాతలు, ప్రభుత్వాలు సమకూర్చిన స్థలాల్లోనే ఉన్నాయి. గాంధీజీ అస్థికలు నిమజ్జనం చేసిన ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ త్రివేణి సంగమం, కర్ణాటకలోని శ్రీరంగపట్నం కావేరి పశ్చిమవాహిని సహా ఇతర చోట్ల భారీ విగ్రహాలు లేవు. గాంధీజీ జన్మించిన పోర్బందర్లో, తాను నివసించిన స్వాతంత్య్ర ఉద్యమ కార్యక్షేత్రమైన సబర్మతి ఆశ్రమంలో, నిర్యాణం చెందిన ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో భారీ గాంధీజీ విగ్రహాలు లేవు. సంబంధిత సమాచారాలు తెలిపే శిలాఫలకాలు, స్థూపాలు, గ్రంథాలయాలు, ఛాయాచిత్ర, వస్తు ప్రదర్శనశాలలు మాత్రమే ఉన్నాయి. 72 అడుగుల ఎత్తయిన గాంధీజీ కాంస్య విగ్రహం బీహార్ రాజధాని పట్నాలో ఉంది. ఏర్పాటు చేసిన స్థలం చంపారన్, క్విట్ ఇండియా ఉద్యమాలకు కేంద్రమైన గాంధీ మైదాన్ ప్రభుత్వానిదే. ప్రజల నుంచి లాక్కున్నది కాదు.
తెలంగాణలో ఊరూరా, వాడవాడలో గాంధీజీ విగ్రహాలు దర్శనమిస్తాయి. గాంధీజీ పేరుతో ఎన్నో సంస్థలు, నివాస ప్రాంతాలు, వీధులు కనిపిస్తాయి. ఆ మహనీయుని దైవసమానంగా భావించే ప్రజలు గాంధీ సరోవర్‌ను అడ్డుకుంటున్నారంటే అది వారి బతుకు పోరాటం. ప్రజలను ఇక్కట్లకు గురిచేసి వారి గుండెకోత పునాదిగా సరోవరాలు నిర్మించాలని గాంధీజీ ఆత్మ ప్రబోధించదు. ప్రజలను బాధపెట్టి కోట్లాది రూపాయల ఖర్చుతో గాంధీ విగ్రహం నెలకొల్పడం సమంజసం కాదని గాంధేయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గాంధీజీ పట్ల భక్తి ప్రపత్తులు ప్రకటించాలనుకుంటే విగ్రహాలు నెలకొల్పడం కంటే పరిపాలనలో ఆ మహనీయుని బోధనలు అనుసరించడం మంచిది. అదే బాపూజీకి
అసలైన నివాళి.
-డాక్టర్ అయాచితం శ్రీధర్
9849893238