రాష్ట్ర రాజకీయాల్లో రైతు సంక్షేమం ఎప్పుడూ సున్నితమైన అంశం. ముఖ్యంగా పంట పెట్టుబడి సాయంగా అమల్లోకి వచ్చిన రైతుబంధు వంటి పథకాలు కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా, ప్రభుత్వాల రాజకీయ నిబద్ధతకు ప్రమాణాలుగా మారాయి. కానీ పథకం పేరును రైతుభరోసా అని మార్చి గోప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అమలులో చిత్తశుద్ధి చూపించడంలేదు. ఇక తాజా పరిణామాలను పరిశీలిస్తే రైతుభరోసా పథకం భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నట్టే కనిపిస్తున్నది. డిసెంబర్లో ఇవ్వాల్సిన సాయంపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం, ఈ అంశం క్యాబినెట్ సమావేశంలో ప్రస్తావనకే రాకపోవడం అనేక సందేహాలకు దారి తీస్తున్నాయి.
ఆరుగాలం శ్రమించే అన్నదాతకు ఆసరాగా నిలిచేలా దేశంలోనే తొలిసారిగా 2018లో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. ప్రతి సీజన్‌కు ఎకరాకు ఇంత అని నిర్దిష్ట సాయం అందించడం ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసుకునేందుకు మూల ధనాన్ని పొందాలన్నది పథకం లక్ష్యం. పథకం ప్రారంభంలో ఎకరానికి రూ.4,000గా మొదలు పెట్టిన సాయాన్ని ఆ తర్వాత రూ.5,000కు పెంచారు. ఏడాదిలో రెండు సీజన్లకు కలిపి ఎకరాకు రూ.10,000 అందించే విధంగా అమలు చేశారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది రైతులు లబ్ధి పొందారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పథకం అమలు తీరుపై అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతు సంక్షేమంపై పలు హామీలు ఇచ్చిన అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతుభరోసాను ఎలా ఎగవేద్దామా అనే ధోరణిలోనే ఆలోచిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతుబంధు సాయం ఫిబ్రవరి నెలాఖరులో కూడా రాకపోవడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
మున్సిపల్ ఎన్నికల ముందు రైతుబంధు చెల్లింపులపై స్పష్టత రాకపోవడంతో ప్రభుత్వం విమర్శలకు గురైంది. ఎన్నికల అనంతరం రైతుభరోసా నిధులు విడుదల చేస్తామని ఫిబ్రవరి 4న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నమ్మబలికారు. నాట్లు పూర్తయ్యేలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ఫిబ్రవరి 5న వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి.. పొలాల్లో నాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ రైతుభరోసా సాయం మాత్రం ఖాతాల్లో పడలేదు. ప్రభుత్వ పెద్దల మాటలు నీటిమూటలుగానే మిగిలిపోవడంతో రైతులు నిరాశలో కూరుకుపోయారు. ఇటీవల జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో రైతుభరోసా అంశం కనీసం చర్చకు రాలేదు. అత్యంత కీలకమైన అంశం కనీసం ప్రస్తావనకు నోచుకోలేదు. ప్రభుత్వ ఉద్దేశం ఏంటి, అసలు రైతుభరోసా ఇస్తుందా ఇవ్వదా అని అన్నదాతల్లో సందేహాలు కలుగుతున్నాయి. రైతుభరోసా అనేది అన్నదాతలకు పెట్టుబడి సాయం. పంట వేసే సమయంలో నగదు అందకపోతే అప్పుల పాలవ్వాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రైతుభరోసా పథకాన్ని కాంగ్రెస్ పాలకులు రాజకీయ కోణంలోనే చూస్తున్నట్టు కనిపిస్తున్నది. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు 5 సార్లు ఇవ్వాల్సిన రైతుబంధు సాయానికి గాను పూర్తిస్థాయిలో ఇచ్చింది ఒక్కసారి మాత్రమే. 2023 డిసెంబర్లో కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వడానికి నిధులు సిద్ధం చేసి పెట్టింది. కానీ ఎన్నికల కోడ్ పంపిణీకి ఏర్పడింది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఆ సాయాన్ని అందించడంలో చాలా ఆలస్యం చేసింది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో దిగిరాక తప్పలేదు. 2024 ఏప్రిల్-మేలో ఇచ్చింది. అవి కూడా కేసీఆర్ హయాంలో సిద్ధం చేసి ఉంచిన నిధులే.
కాంగ్రెస్ ప్రభుత్వం 2024 వానకాలంలో ఇవ్వాల్సిన రైతుభరోసాను పూర్తిగా ఎగ్గొట్టింది. 2025 యాసంగిలో మూడు ఎకరాలకు మించి ఉన్న రైతులకు రైతుభరోసా మొండి చేయి చూపించింది. ప్రస్తుత యాసంగికి సంబంధించిన రైతుభరోసా ఇంకా ఎవరికీ అందలేదు. ఇది అందుతుందో లేదో అనే ఆందోళన రైతుల్లో నెలకొన్నది. కనీసం క్యాబినెట్ మీటింగ్‌లో కూడా చర్చించలేదంటే ప్రభుత్వ ఆంతర్యమేంటో అర్థం కావడంలేదని రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా పథకాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నట్టు అనిపిస్తున్నది. కేసీఆర్ నిధులు సిద్ధం చేసి పెట్టినప్పటికీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఇవ్వకుండా జాప్యం చేసింది. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతులను ఏప్రిల్ వరకు పీడించింది. ఓట్ల రాజకీయాల కోసం రైతులను వేధించింది. 2025 వానకాలంలో రైతుభరోసా కూడా సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విడుదల చేసినట్టుగా కనిపిస్తున్నది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. అయినా ప్రభుత్వ పెద్దల్లో ఉలుకూ పలుకు లేదు. రైతుభరోసా అనే ఒక పథకం ఉన్నదని, అది సమయానికి ఇవ్వాలనే ఆలోచన కూడా లేనట్టుగానే ప్రభుత్వంవ్యవహరిస్తున్నది.
ఇక్కడ మరో ముఖ్య అంశం సమయపాలన. పంట వేసే సమయం ప్రకారం రైతులకు పెట్టుబడి సాయం ముందుగానే అందాలి. నాట్లు పూర్తయ్యాక డబ్బులు జమైతే ఆ ప్రయోజనం తగ్గిపోతుంది. వ్యవసాయం కాలపరిమితి ఆధారిత రంగం. ఒకసారి సీజన్ మిస్ అయితే నష్టం పూడ్చుకోవడం కష్టం. కాబట్టి రైతుభరోసా వంటి పథకాల అమలులో సమయపాలన అత్యంత కీలకం. ప్రస్తుత జాప్యం వల్ల రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఇక అత్యంత కీలకమైన రైతుభరోసా అంశం క్యాబినెట్ సమావేశంలో ప్రస్తావించకపోవడంపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నది. ఇప్పటికే రైతుభరోసా పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని చూస్తూ వస్తున్న అన్నదాతలు.. ఇప్పుడు అసలు పథకాన్ని ఎత్తేస్తారా ఏంటి అని ఆందోళన చెందుతున్నారు.
రైతుభరోసా పంపిణీ తీరు
2023-24 పంపిణీ పూర్తి (కేసీఆర్ హయాంలో సిద్ధం చేసిన నిధులు)
-రామకిష్టయ్య సంగనభట్ల
94405 95494