దేశంలోని మూడు రాష్ర్టాల్లో ఇటీవల మూడు అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు జరిగాయి. ఈ మూడుచోట్లా మూడు వేర్వేరు పార్టీలు గెలిచాయి. స్థూల దృష్టికి ఇది సాధారణ విషయంలా అనిపించవచ్చు. కానీ ఈ ఫలితాలకు ఓ ప్రత్యేకత ఉన్నది. ఇవి దేశంలో మారుతున్న లేదా చాలావరకు మారిపోయిన రాజకీయ దృశ్యాన్ని మనకు చూపిస్తున్నాయి. పన్నెండేండ్ల పైచిలుకు కాలంగా కేంద్రంలో సాగుతున్న ఎన్డీయే అప్రతిహత పాలనకు ఇవి ప్రమాద ఘంటికలు మోగించాయని మాత్రం చెప్పవచ్చు. మొదటిది, నితీశ్‌కుమార్‌ను తప్పించి బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన బీహార్‌లో సుప్రసిద్ధ ఎన్నికల విశ్లేషకుడు, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ బాంకీపుర్ ఉపఎన్నికలో సాధించిన అనూహ్య విజయం. పాలకపక్ష అభ్యర్థిపై 19 వేల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. బీజేపీ కంచుకోట బద్దలు చేశాడంటూ ఆయనపై ప్రశంసలు కురుస్తుండటం గమనార్హం. రెండోది, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం దక్కించుకున్న మధ్యప్రదేశ్‌లోని దతియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన్‌శ్యామ్ సింగ్ బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై 6 వేల ఓట్లతో గెలువడం. మూడోది, గుజరాత్‌లోని మంజల్పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సతీశ్ గోవింద్‌భాయ్ పటేల్‌ను 30 వేల మెజారిటీతో ఓడించడం.
దేశం ఎంతో ఆసక్తిగా గమనించిన ఈ మూడు ఉపఎన్నికల ఫలితాలు నిర్ణాయకమైనవి కాకపోవచ్చు గానీ, ఓటర్ల ఆలోచనలో వచ్చిన మార్పునకు, బీజేపీకి వీస్తున్న ఎదురుగాలికి అవి అద్దం పడుతున్నాయని మాత్రం చెప్పవచ్చు. పై మూడు ఫలితాల్లో ప్రశాంత్ కిశోర్ విజయం గురించే ఎక్కువగా చర్చ జరుగడానికి పలు కారణాలు ఉన్నాయి. ఆయన గెలిచిన బాంకీపుర్ నియోజకవర్గం బీజేపీకి ప్రతిష్ఠాత్మకమైందని చెప్పాల్సిన పనిలేదు. పైగా అది ఆ పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయ్యింది కావడం, ఉపఎన్నికలో అధికార పార్టీ గెలువడం అనే ఆనవాయితీకి విరుద్ధంగా ఫలితం రావడం గమనార్హం. 31 సంవత్సరాలుగా గెలుస్తున్న స్థానం కోల్పోవడం అనేది పాలకపక్షానికి ఓ సంకేతం. గత ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపని జన్ సురాజ్ పార్టీ నేత భారీ మెజారిటీతో గెలువడం ఓటర్ల దృక్పథంలో వచ్చిన కచ్చితమైన మార్పును సూచిస్తున్నది. మధ్యప్రదేశ్‌లోనూ పాలక బీజేపీకి చుక్కెదురు కావడం మరో సంకేతం. ఇక సంప్రదాయికంగా బీజేపీ రాష్ట్రంగా కొనసాగుతున్న గుజరాత్లో అధికారపక్ష అభ్యర్థి గెలిచినప్పటికీ 2022లో వచ్చిన లక్ష ఓట్ల ఆధిక్యం కాస్తా 30 వేలకు పడిపోవడం పార్టీ బలం సన్నగిల్లిందనడానికి నిదర్శనం.
ఏ రకంగా చూసినా ఈ మూడు ఫలితాలు బీజేపీకి, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి కునుకు లేకుండా చేసేవిగానే ఉన్నాయి. ఓటర్లు ప్రత్యామ్నాయాల వైపు, ప్రయోగాల వైపు చూస్తున్నారని ఈ మూడుచోట్ల వెలువడిన ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. బీజేపీ సహా బీహార్‌లో పాతుకుపోయిన పార్టీలకు వారు అంతగా ప్రాముఖ్యం ఇవ్వలేదు. బాంకీపుర్‌లో తాము ‘కుక్కను నిలబెట్టినా, పిల్లిని పోటీకి పెట్టినా’ గెలుపు తమదేనని విర్రవీగిన బీజేపీకి ఓటర్లు గట్టి గుణపాఠం చెప్పారు. ఢిల్లీలో జెన్-జీ ఆందోళన ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, అయోధ్య రామాలయంలో విరాళాల చోరీపై ఉధృత స్థాయిలో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికలు జరిగాయనేది గుర్తుంచుకోవాలి. బీజేపీకి ఇన్నాళ్లూ అండగా నిలిచిన వర్గాలు దూరమవుతున్నాయని ఫలితాలు తెలియజేస్తున్నాయి. మతపరమైన విభజన రాజకీయాలు, ప్రగతి, సంక్షేమాలను పక్కనబెట్టి కార్పొరేట్ల కొమ్ముకాసే విధానాల పట్ల ఓటర్లలో విముఖత ఏర్పడింది. ప్రజల బాగోగులు పట్టించుకునే రాజకీయాలు కావాలన్న ప్రశాంత్ కిశోర్ వైపు ఓటర్లు మొగ్గడం విశేషం. పాతుకుపోయిన ఆర్జేడీ వంటి పార్టీలనూ పక్కన పెట్టడం కొసమెరుపు.