మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 06, 2020 , 17:23:38

మ‌నువ‌డిని కంటికి రెప్ప‌లా కాపాడుకున్న బామ్మ‌లు

మ‌నువ‌డిని కంటికి రెప్ప‌లా కాపాడుకున్న బామ్మ‌లు

అహ్మ‌దాబాద్ : ఓ బాలుడికి ఆహార వాహిక లేకుండానే జ‌న్మించాడు. బాబు బ‌త‌క‌డం చాలా క‌ష్టం.. కానీ ఆ బిడ్డ‌ను బ‌తికించేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నం చేస్తామ‌ని వైద్యులు హామీ ఇచ్చారు. వైద్యులు ఆ బాబుకు స‌ర్జ‌రీ చేసి ఆహార పైపును అమ‌ర్చారు. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. ఇక మ‌రి ఇంట్లో కూడా బాబును కంటికి రెప్ప‌లా చూసుకోవాలి. ఆ బాధ్య‌త‌ను అమ్మ‌మ్మ‌, నాన‌మ్మ తీసుకున్నారు. సంవ‌త్స‌రం పాటు ఆ బిడ్డ‌ను ద‌గ్గ‌రుండి చూసుకుని ప్రాణం పోశారు గ్రాండ్ మ‌ద‌ర్స్. 

ఏడాది క్రితం మ‌హ్మ‌ద్ ఉమ‌ర్ మాలేక్ అనే అబ్బాయి అహ్మ‌దాబాద్ లో జ‌న్మించాడు. అయితే ఆ బిడ్డ‌కు పుట్టుక‌తోనే ఆహార వాహిక లేదు. దీని వ‌ల్ల పేగుల‌కు, క‌డుపుకు మ‌ధ్య అడ్డు ఏర్ప‌డింది. దీంతో బాబు పుట్టిన మ‌రుస‌టి రోజే.. స‌ర్జ‌రీ చేసి పేగుల‌కు, క‌డుపుకు మ‌ధ్య ఉన్న అడ్డును తొల‌గించారు. ఆ త‌ర్వాత ఓ గొట్టాన్ని అమ‌ర్చారు వైద్యులు. దీంతో ఆహారం తీసుకునేందుకు కాస్త మార్గం ఏర్ప‌డింది. మ‌రో 8 నెల‌ల త‌ర్వాత ఇంకో స‌ర్జ‌రీ చేయాల‌ని అప్పుడే వైద్యులు చెప్పారు.

ఇక ఈ ఎనిమిది నెల‌ల కాలం నాన‌మ్మ స‌బేరా మాలేక్, అమ్మ‌మ్మ ఖుర్షీదా ఆ బాబును ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. డాక్ట‌ర్లు ఏదైతో చెప్పారో ఆ విధంగా బాబుకు ఆహారం ఇచ్చారు. ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా వీరిద్ద‌రే బాబును ఆస్ప‌త్రికి తీసుకెళ్లేవారు. అలా 8 నెల‌ల కాలం గ‌డిచింది. జులై 3వ తేదీన రెండో స‌ర్జ‌రీ చేశారు. ఇప్పుడు బాబు  నోటితో పాలు తాగ‌గ‌లుగుతున్నాడు. ఆరోగ్యంగా ఉన్నాడు. దీంతో గ్రాండ్ మ‌ద‌ర్స్ సంతోషం వ్య‌క్తం చేశారు. 

 స‌బేరా పొద్దున్నే లేచి అంద‌రికీ టిఫిన్లు త‌యారు చేసేది. ఆ త‌ర్వాత ఉమ‌ర్ ను చూసుకునేది. రాత్రి 8 గంట‌ల నుంచి ఖుర్షీదా బాబు ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించేది. ఇలా ఒక‌రికొకరు మ‌నువ‌డిని జాగ్ర‌త్త‌గా చూసుకుంటూ ప్రాణాల‌తో కాపాడుకున్నారు. 


logo