అహ్మదాబాద్: గుజరాత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ శుక్రవారం జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రులంతా గురువారం రాజీనామా చేశారు. (Gujarat ministers resign) ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మాత్రమే రాజీమానా చేయలేదు. మంత్రివర్గంలో ఏకైక సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. గురువారం సాయంత్రం సీఎం నివాసంలో కీలక సమావేశం జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్, సీఎం భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. మంత్రులందరిని వ్యక్తిగతంగా వారు కలిశారు. కేంద్ర నాయకత్వం నిర్ణయాన్ని వివరించి వారి నుంచి రాజీనామాలు స్వీకరించారు.
కాగా, సీఎం భూపేంద్ర పటేల్ ఈ రాత్రికి గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలువనున్నారు. మంత్రుల రాజీనామాలను అధికారికంగా సమర్పిస్తారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు గుజరాత్ కొత్త మంత్రివర్గం ఏర్పడనున్నది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నది.
మరోవైపు ఐదారు మంది మంత్రులకు కొత్త మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు తెలుస్తున్నది. మిగిలిన పదవులను కొత్తవారితో భర్తీ చేయనున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుల, ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని సమతుల్యం చేయడం, ప్రభుత్వంలో కొత్త శక్తిని నింపేందుకు బీజేపీ విస్తృత వ్యూహంలో భాగంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
Also Read:
Son Poses As Maoist | మావోయిస్ట్ పేరుతో తండ్రిని బెదిరించి.. రూ.35 లక్షలు డిమాండ్ చేసిన కొడుకు
Employee Flees With Railways’ Rs 70 Lakh | రూ.70 లక్షల రైల్వే డబ్బుతో.. ఉద్యోగి పరార్