Rahul Gandhi : భారత ఎన్నికల సంఘం (Election Commission of India) పై లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఆ విషయాన్ని రుజువు చేసేందుకు తమవద్ద అణుబాంబు లాంటి ఆధారాలున్నాయని చెప్పారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈసీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ చేపట్టింది. దానికి సంబంధించి ఇవాళ ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసింది. అయితే ఈ సవరణను ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రస్థాయి నుంచి ఓట్ల చౌర్యం జరుగుతోందని తాము ఎప్పటినుంచో అనుమానిస్తున్నామన్నారు.
మధ్యప్రదేశ్, మహారాష్ట్రతోపాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయని రాహుల్‌గాంధీ విమర్శించారు. ఓటరు సవరణ చేపట్టి కోట్లాది మంది కొత్త ఓటర్లను అదనంగా చేరుస్తున్నారని, దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తే ఈసీ వ్యవహారం బయటపడిందని చెప్పారు. ఆరు నెలలపాటు తాము సొంతంగా దర్యాప్తు జరిపి ఆటమ్ బాంబు లాంటి ఆధారాలను సాధించామన్నారు.
ఆ బాంబు పేలిన రోజు ఎన్నికల సంఘం దాక్కోవడానికి కూడా అవకాశమే ఉండదని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. బీజేపీ కోసమే ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని, ఇది దేశద్రోహం కంటే తక్కువేం కాదని మండిపడ్డారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ఒక్కరినీ తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అధికారులు రిటైర్ అయినా, ఎక్కడ దాక్కున్నా కనిపెడతామని వార్నింగ్ ఇచ్చారు.