Cyber crime : రోజురోజుకు సైబర్ నేరాలు (Cyber crimes) కొత్తరూపం తీసుకుంటున్నాయి. ఇప్పటివరకు సైబర్ నేరగాళ్లు (Cyber criminals) వ్యక్తులను డిజిటల్ అరెస్టు (Digital arrest) చేయడం, బెదిరించి సొమ్ము బదిలీ చేసుకోవడం, ఇతర పద్ధతుల్లోనూ మోసాలకు పాల్పడటం లాంటివి మాత్రమే చేసేవాళ్లు. ఇప్పుడు ఏకంగా కంపెనీలనే లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతున్నారు. తాజాగా బెంగళూరు (Bengalore) లోని క్రిప్టోకరెన్సీ (Crypto currency) ఎక్సేంజ్ సంస్థ నెబ్లియో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (Neblio Technologies Pvt, Ltd) సర్వర్‌ను హ్యాక్ చేసి ఏకంగా రూ.378 కోట్ల మోసానికి పాల్పడ్డారు. కంపెనీకి చెందిన రూ.378 కోట్లను వేరే ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు.
నెబ్లియో టెక్నాలజీస్ అనేది దేశంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్ సంస్థ. ఈ సంస్థ పటిష్ఠమైన అంతర్గత భద్రతా చర్యలను పాటిస్తోంది. అయినప్పటికీ సైబర్ నేరగాళ్లు ఈ సంస్థ సర్వర్లోకి ప్రవేశించి భారీ మోసానికి పాల్పడ్డారు. అందుకోసం క్రిమినల్స్ ఆ సంస్థలో పార్ట్‌టైమ్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాహుల్ అగర్వాల్ అనే వ్యక్తి ల్యాప్‌టాప్‌ను వినియోగించుకున్నట్టు పోలీసులు గుర్తించారు. దీన్ని దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసంగా పేర్కొన్నారు.
కాగా సైబర్ నేరగాళ్లు తమ సంస్థ నుంచి బదిలీ చేసుకున్న సొమ్ము పూర్తిగా సంస్థది, సంస్థ భాగస్వాములదేనని, వినియోగదారులకు ఎలాంటి నష్టం జరగలేదని నెబ్ల్లియో టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ హర్దీప్సింగ్ తెలిపారు. క్రిప్టో సహా బిట్ కాయిన్ ఎక్సేంజ్ సంస్థ అయిన నెబ్లియో టెక్నాలజీస్‌కు దేశంలోనే మంచి పేరుంది. ఈ కంపెనీనే ‘కాయిన్ డీసీఎక్స్ (Coin DCX)’ అని కూడా పిలుస్తారు. ఈ సంస్థ వినియోగించే ప్రత్యేక సాఫ్ట్ వేర్ సహా రెండంచల భద్రతా వ్యవస్థలు కంపెనీ ప్రొటెక్షన్‌లో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
అయితే ఈ నెల 19న (శనివారం) తెల్లవారుజామున 2.37 గంటలకు కంపెనీ వాలెట్ నుంచి యూఎస్ డాలర్ టెదర్ (USDT) గుర్తు తెలియని వ్యాలెట్‌కు బదిలీ అయింది. ఆ తర్వాత ఉదయం 9.40 గంటలకు సైబర్ నేరగాళ్లు సర్వర్లోకి ప్రవేశించి ఏకంగా 44 మిలియన్ యూఎస్డీటీ (రూ.378 కోట్ల) ని బదిలీ చేశారు. ఈ బదిలీ జరిగిన తర్వాత వెబ్-3 ట్రేడింగ్ ఆగిపోయింది. దాంతో ఉలిక్కిపడిన సంస్థ అధికారులు.. అసలేం జరిగిందన్న విషయంపై దృష్టిపెట్టారు.
ఈ సంస్థలో పార్ట్‌టైమర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి రాహుల్ అగర్వాల్ ల్యాప్‌టాప్ నుంచి సైబర్ నేరగాళ్లు కంపెనీ సర్వర్‌ను హ్యాక్ చేశారని గుర్తించారు. అనంతరం సంస్థ వైస్ ప్రెసిడెంట్ హర్దీప్సింగ్ ఈ నెల 22న వైట్‌ఫీల్డ్ సీఈఎన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రాహుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తాను అదే ల్యాప్‌టాప్‌ను మరోచోట వినియోగించినట్లు చెప్పాడు. అందుకు అక్కడ ఏడాది కాలంలో రూ.15 లక్షలు పొందినట్లు తెలిపాడు. దాంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
కాగా సైబర్ నేరగాళ్ల మోసంతో పోగొట్టుకున్న సొమ్మును రాబట్టుకునేందుకు నెబ్లియో టెక్నాలజీస్ సంస్థ అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోంది. తాము పోగొట్టుకున్న రూ.378 కోట్లను రికవరీ చేస్తే ఏకంగా రూ.96 కోట్లను రివార్డుగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇదిలావుంటే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సాధారణంగా సిస్టమ్‌లను హ్యాక్ చేసేందుకు ఫిషింగ్, రాన్సమ్వేర్, బ్రూట్-ఫోర్స్ వంటి వాటిని నేరగాళ్లు వినియోగిస్తారు. కానీ ‘కాయిన్ డీసీఎక్స్’ విషయంలో మాత్రం ఈ సంస్థ ప్రత్యేకంగా వినియోగిస్తున్న ‘ఇంటర్నల్ ఆపరేషనల్ అకౌంట్’ను లక్ష్యంగా చేసుకున్నారు.
సంస్థ వినియోగిస్తున్న అధునాతన సర్వర్ వాల్ట్ ఐసోలేషన్, ఏపీఐలను అత్యంత చాకచక్యంగా సైబర్ నేరగాళ్లు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. వాస్తవానికి నెబ్లియో సంస్థ సిస్టమ్ రక్షణ కోసం ‘ఫైర్‌వాల్’ను ఏర్పాటు చేసింది. కానీ ఈ ఫైర్ వాల్స్.. ప్రధాన యాప్ సేవలకు, డేటాబేస్ భద్రతకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. లిక్విడిటీ బ్రిడ్జ్ లేదా ఏపీఐకి అనుసంధానించిన ఆపరేషనల్ వ్యాలెట్‌కు ఫైర్ వాల్స్ భద్రత కల్పించలేవు. నెబ్లియోలో కూడా ‘ఆపరేషనల్ వ్యాలెట్’ను హ్యాక్ చేయడం ద్వారానే సైబర్ మోసం జరిగింది.