Actress Radhika : ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ (Radhika Sharat Kumar) డెంగ్యూ జ్వరం (Dengue feaver) తో బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన రాధికను కుటుంబసభ్యులు ఈ నెల 28న తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన వైద్యులు డెంగ్యూ సోకినట్లు నిర్ధారించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం రాధికకు చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నాయి. ఈ నెల 5 వరకు ఆమెకు చికిత్స కొనసాగించాల్సిన అవసరం ఉందని, ఆ తర్వాత ఆమెను డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. కాగా అభిమానులు, సన్నిహితులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
రాధిక తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు, సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు పొందారు. నటిగానే కాకుండా విజయవంతమైన టీవీ సీరియల్ నిర్మాతగానూ పేరొందారు. రాధిక రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో చిరంజీవితో ఆమె దాదాపు 15కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.