– బీఆర్ఏఓయూ జేడీ, ఎస్సీ, ఎస్టీ సెల్ లైజన్ ఆఫీసర్ డా.ధర్మానాయక్
రామగిరి, మార్చి 06 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్ఏఓయూ) సహకారంతో స్వామి రామానంద తీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఏఓయూ జాయింట్ డైరెక్టర్, ఎస్సీ, ఎస్టీ సెల్ లైజన్ ఆఫీసర్ డా.బి.ధర్మానాయక్ తెలిపారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాల ప్రాంగణంలోని బీఆర్ఏఓయూ ఉమ్మడి జిల్లా రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్స్, అధికారులతో నిర్వహించిన సమావేశం అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీ వీసీ ప్రొ.ఘంటా చక్రపాణి ఆలోచనతో విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, గిరిజనులు, ఆదివాసీలకు ఉచితంగా లేదా అత్యల్ప ఫీజుతో ఉన్నత విద్య అందించేందుకు యూనివర్సిటీ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగానే గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు సాంకేతిక, ఉపాధి ఆధారిత కోర్సులు అందించడమే ప్రధాన లక్ష్యంగా స్వామి రామానంద తీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్ ద్వారా ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు.
శిక్షణలో మొబైల్ ఫోన్ రిపేరింగ్, కంప్యూటర్ హార్డ్ వేర్, ఆటోమొబైల్ సర్వీసింగ్, ఎలక్ట్రిషియన్, సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ వంటి కోర్సులు అందుబాటులోకి తెచ్చిందన్నారు. శిక్షణ పూర్తి చేసిన వారికి వర్సిటీ ఆధ్వర్యంలో సర్టిఫికెట్స్ ఇస్తామన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత ధృవపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణకు ఎంపికైన వారికి కొన్ని ప్రాంతాల్లో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కూడా కల్పించబడే అవకాశం ఉందని తెలిపారు. అర్హతలు, కోర్సుల వివరాలు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం నల్లగొండలోని వర్సిటీ రీజినల్ కేంద్రంలో గాని, ఉమ్మడి జిల్లాలోని వర్సిటీ అధ్యాయన కేంద్రాల్లో గాని సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఏఓయూ ఉమ్మడి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ డా.బొజ్జ అనిల్‌కుమార్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్స్ శ్రీకాంత్, బద్దం మహేశ్ పాల్గొన్నారు.

‘యువత నైపుణ్యాభివృద్ధి అవకాశాలకై దరఖాస్తుల ఆహ్వానం’