న్యూఢిల్లీ: ఒలింపిక్ రెజ్లర్ సుశీల్ కుమార్(Sushil Kumar)కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. మాజీ జూనియర్ జాతీయ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ ధంకర్ మర్డర్ కేసులో సుశీల్ కుమార్ శిక్ష అనుభవిస్తున్నాడు. ఆగస్టు 6వ తేదీన రెజ్లర్ సుశీల్ కుమార్ బెయిల్ దరఖాస్తును జస్టిస్ పురుషేంద్ర కుమార్ డిస్మిస్ చేశారు. అరెస్టు చేయడానికి ముందు అతని ప్రవర్తన, నేరం తీవ్రత, సాక్ష్యులను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్‌ను నిరాకరిస్తున్నట్లు గతంలో సుప్రీంకోర్టు కూడా పేర్కొన్నది. ఈ కేసులో రెజ్లర్ సుశీల్ తీవ్రమైన నేరానికి పాల్పడినట్లు జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. ముందుగా ప్లాన్ చేసి హత్య చేశారని, ఆ మర్డర్‌కు చెందిన ఆయుధాన్ని రికవరీ చేశారని, వీడియో ఆధారాలు కూడా ఉన్నట్లు జడ్జి తన తీర్పులో తెలిపారు. ఢిల్లీ పోలీసులు, బాధిత రెజ్లర్ ధంకర్ తండ్రి కూడా బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించారు.