Nobel to Donald Trump : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) ఇవ్వాల్సిందేనట. అందుకోసం అమెరికా (USA) మరోసారి డిమాండ్ చేసింది. థాయ్‌లాండ్ (Thailand), కాంబోబోడియా (Combodia) దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని తాజాగా మలేసియా ప్రధాని (Malaysia Prime Minister) అన్వర్ ఇబ్రహీం (Anwar Ibrahim) ప్రకటించిన నేపథ్యంలో వైట్‌హౌస్ (White House) స్పందించింది. వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివెట్ (Karoline Leavitt) గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అన్నివిధాలా అర్హుడేనని అన్నారు.
ఈజిప్ట్-ఇథియోపియా మొదలుకొని తాజాగా థాయ్‌లాండ్–కాంబోడియాల దాకా.. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సగటున నెలకు ఓ యుద్ధాన్ని నిలువరించారని కరోలిన్ చెప్పారు. దాడులు, ప్రతిదాడులతో రగిలిపోతున్న దేశాలను ఆయన శాంతింపజేశారని వివరించారు. ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులకు ఫోన్‌చేసి యుద్ధం ఆపేయాలని హెచ్చరించారని తెలిపారు. దాంతో పలు దేశాల మధ్య యుద్ధాలు ఆగిపోయాయని చెప్పారు.
ట్రంప్ జోక్యంవల్లే థాయ్‌లాండ్–కాంబోడియా, ఇజ్రాయెల్–ఇరాన్, రువాండా–కాంగో (డీఆర్సీ), ఇండియా–పాకిస్థాన్, సెర్బియా–కొసావో, ఈజిప్ట్–ఇథియోపియా దేశాల మధ్య యుద్ధాలు ఆగాయని కరోలిన్ అన్నారు. ట్రంప్ జోక్యం చేసుకోకుంటే ఈ యుద్ధాలవల్ల భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించేదని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చి శాంతిని నెలకొల్పిన ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
కాగా భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ పదేపదే ప్రకటిస్తుండటంతో నరేంద్రమోదీ సర్కారుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. భారత్-పాక్ సరిహద్దు సమస్యల విషయంలో థర్డ్ పార్టీ జోక్యాన్ని అంగీకరించబోమని ఓవైపు చెబుతూనే ట్రంప్ జోక్యాన్ని ఎలా అంగీకరించారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంలో ట్రంప్ జోక్యం ఉందనిగానీ, లేదనిగానీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పడంలేదు. దాంతో విపక్షాలు సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి.