Mumbai | మహారాష్ట్ర ముంబై (Mumbai)ని భారీ వర్షం ముంచెత్తింది. సోమవారం తెల్లవారుజామున 1 గంటకు మొదలైన వాన ఉదయం 7 గంటల వరకు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. కేవలం ఏడు గంటల వ్యవధిలోనే సుమారు 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నగరం మొత్తం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కార్లు, బైక్‌లు నీటపై తేలాడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి కూడా నీరు చేరింది. దీంతో నగరంలో జనజీవనం స్తంభించిపోయింది.
రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా అధికారులకు సీఎం పలు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో బీచ్‌ల దగ్గరకు ఎవరినీ అనుమతించొద్దని పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కాగా, భారీ వర్షం కారణంగా రైళ్లు, విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. వానల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలతో తక్కువ దృశ్యమానత కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్యాహ్నం 2.22 నుంచి 3.40 గంటల వరకు రన్‌వే కార్యకలాపాలను నిలిపివేసింది. దాంతో 50పైగా విమానాలను రద్దు చేయడంతో పాటు ఆయా విమానాలను అహ్మదాబాద్, హైదరాబాద్, ఇండోర్‌కు మళ్లించారు.
వరద పరిస్థితిని సమీక్షించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే డిజాస్టర్ కంట్రోల్ రూమ్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ముంబయి గార్డియన్ మంత్రి ఎంపీ లోధా, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మంత్రి అనిల్ పాటిల్ సైతం హాజరయ్యారు. సమావేశంలో సీఎం షిండే మాట్లాడుతూ నిన్న రాత్రి నుంచి ముంబయిలో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. వర్షం నీటిని తోడేందుకు 200 నీటి పంపులు, 400 బీఎంసీ పంపులు పని చేశాయని.. సెంట్రల్, హార్బర్ లైన్లలో రైళ్లు తిరిగి ప్రారంభమైనట్లు తెలిపారు.
Also Read..
Raigad Fort | రాయ్‌గఢ్ ఫోర్ట్‌ను ముంచెత్తిన వరద.. చిక్కుకుపోయిన పర్యాటకులు.. భయానక వీడియో
Assam Floods | కజిరంగ నేషనల్ పార్క్‌ను ముంచెత్తిన వరద.. 131 వన్యప్రాణులు మృత్యువాత
Landslides | భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండచరియలు.. మొఘల్ రహదారి మూసివేత