Assam Floods | అస్సాంలో వరద బీభత్సం (Assam Floods) కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. కుండపోతతో గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయి. రహదారులు, కమ్యూనికేషన్ల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. రాష్ట్రంలోని అన్ని నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఈ వరదల కారణంగా కజిరంగ జాతీయ పార్కు (Kaziranga National Park) తీవ్ర ప్రభావానికి గురైంది. పార్కులోకి భారీగా నీరు చేరింది. దీంతో సుమారు 131 వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి (131 wild animals dead).
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చనిపోయిన జంతువుల్లో ఆరు ఖడ్గమృగాలు, 117 హాగ్ జింకలు (ఇందులో 98 నీట మునిగి ప్రాణాలు కోల్పోగా.. రెండు జింకలు వాహనాలు ఢీకొట్టి చనిపోయాయి. మరో 17 జింకలు చికిత్స సమయంలో ప్రాణాలు కోల్పోయాయి), రెండు సాంబార్, ఒక ఒట్టర్ సహా మొత్తం 131 వన్య ప్రాణాలు మృత్యువాత పడ్డాయి. అదేవిధంగా మరికొన్ని హాగ్ జింకలు, రెండు ఖడ్గమృగాలు, సాంబార్ జింకలు, స్కాప్స్ గుడ్లగూబలు, చిత్తడి జింకలు, కుందేలు, ఒట్టర్, ఏనుగు సహా మొత్తం 97 జంతువులను అధికారులు రక్షించారు. ప్రస్తుతం 25 జంతువులు వైద్య సంరక్షణలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 52 జంతువులను చికిత్స తర్వాత సురక్షిత ప్రాంతంలో వదిలినట్లు పేర్కొన్నారు.
పార్క్లో వరద పరిస్థితిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) పరిశీలించారు. ఈ సందర్భంగా వరద నీటిలో ఓ ఖర్గమృగం చిక్కుకున్న వీడియోని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. వదర నీటిలో చిక్కుకుని ఒంటరిగా ఉన్న ఈ ఖడ్గమృగాన్ని గమనించినట్లు చెప్పారు. వెంటనే దాన్ని రక్షించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదలు మానవులను, జంతువులను ఒకేలా ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ సాయం చేసేందుకు సహాయక బృందాలు 24 గంటలూ శ్రమిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Recently, while passing through Kaziranga, I noticed this stranded rhino calf and instructed its immediate rescue.
The #AssamFloods have affected humans and animals alike and Team Assam is working round the clock to aid everyone. pic.twitter.com/gljiVaGzhJ
— Himanta Biswa Sarma (@himantabiswa) July 8, 2024
ఇక ఈ వదరలకు రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా ప్రజలు ప్రభావితులయ్యారు. గోల్పరా, నాగావ్, నల్బరీ, కమ్రూప్, మోరిగావ్, దిబ్రూఘఢ్, సోనిత్పూర్, లఖింపూర్, సౌత్ సల్మారా, ధుబ్రి, జోర్హాట్, చారైడియో, హోజై, కరీంనగర్, శివసాగర్, బొంగైగావ్, బార్పేట, ధేమాజీ, హైలాకండి, గోలాఘాట్, దర్రాంగ్, బిస్వనాథ్, కాచర్, కమ్రూప్ (M), టిన్సుకియా, కర్బీ అంగ్లాంగ్, చిరాంగ్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, మజులి జిల్లాలు వరదల కారణంగా తీవ్ర ప్రభావితమయ్యాయి. ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది వరదలు, కొండచరియలు వంటి ఘటనల కారణంగా మరణించిన వారి సంఖ్య 64కి పెరిగింది.
Also Read..
Landslides | భారీ వర్షాలకు విరిగిపడ్డ కొండచరియలు.. మొఘల్ రహదారి మూసివేత
Rath Yatra | రెండో రోజు శోభాయమానంగా జగన్నాథ రథయాత్ర.. డ్రోన్ విజువల్స్
Hemant Soren | విశ్వాస పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్.. నేడు కేబినెట్ విస్తరణ