Shatavari | ప్రకృతిలో లభించే అనేక మొక్కలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వాటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అలాంటి మొక్కల్లో శతావరి కూడా ఒకటి. ఈ మొక్క శాస్త్రీయ నామం ఆస్పారగస్ రేసెమోసస్. ఈ మొక్క ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది. ఈ మొక్కను ఆయుర్వేదంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. శతావరి మొక్కను వాడడం వల్ల మొత్తం శరీరానికి మేలు కలుగుతుంది. సంతాన సమస్యలను తగ్గించడంలో, జీర్ణశక్తిని పెంచడంలో, నాడీ వ్యవస్థను మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా ఈ మొక్క మనకు సహాయపడుతుంది. శతావరి మొక్కను ఉపయోగించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, అలాగే దీనిని ఎంత మొత్తంలో తీసుకోవాలి, దీని వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఆయుర్వేద వైద్యులు వివరిస్తున్నారు.
శతావరి మొక్కను ఔషధంగా తీసుకోవడం వల్ల స్త్రీలల్లో సంతానలేమి సమస్యలు తగ్గుతాయి. స్త్రీల్లలో అండం విడుదలను మెరుగుపరచడంతోపాటు గుడ్డు నాణ్యతను పెంచడంలో, నెలసరి సమస్యలను తగ్గించడంలో, గర్భధారణకు గర్భాన్ని సిద్దం చేయడంలో ఇలా అనేక రకాలుగా శతావరి మొక్క సహాయపడుతుంది. అలాగే శతావరి మొక్కను వాడడం వల్ల అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి నాడీ కణాలను కాపాడడంలో ఈ మొక్క ఎంతో దోహదపడుతుంది. శతావరి మొక్క యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్పెక్షన్ లను తగ్గించి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో శతావరి మొక్క ఎంతగానో దోహదపడుతుంది. శతావరి మొక్క రేస్మోఫ్యూరాన్, ఆస్ఫరాగమైన్, రేస్మోసోల్ అనే యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇవి ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడుతాయి.
ఇక శతావరి మొక్కను ఉపయోగించడం వల్ల జీర్ణాశయంలో అల్సర్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. పాలిచ్చే తల్లులు ఈ మొక్క వేర్ల పొడిని ఔషధంగా తీసుకోవడం వల్ల వారిలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. అతిసారంతో బాధపడే వారు ఈమొక్క వేర్ల సారాన్ని తీసుకోవడం వల్ల అతిసారం సమస్య తగ్గుతుంది. ఇక శతావరి పొడి తీపిగా, కొంత చేదుగా ఉంటుంది. దీనిని గది ఉష్ణోగ్రత వద్ద నీటిలో లేదా పాలల్లో కలిపి తీసుకోవచ్చు. ఈ పొడిని శరీర బరువు, వయసు, ఆరోగ్యాన్ని బట్టి తగిన మోతాదులో తీసుకోవాలి. కొంతమందిలో ఈ పొడి ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను కూడా కలిగించవచ్చు. అలాగే దద్దుర్లు, శ్వాస సమస్యలు కూడా రావచ్చు. ఈ పొడిని తీసుకోవడం వల్ల అధిక మూత్రవిసర్జనతో పాటు గుండెపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు దీనిని వైద్యుల సమక్షంలో ఉపయోగించడం మంచిది.
అలాగే ఉల్లిపాయలు, లీక్స్, వెల్లుల్లి వంటి వాటికి అలర్జీ ఉన్న వారికి శతావరి కూడా అలెర్జీని కలిగించవచ్చు. అంతేకాకుండా శతావరి పొటాషియం స్థాయిలను తగ్గిస్తుంది. కనుక మూత్రవిసర్జనకు సంబంధించిన మాత్రలు వాడే వారు శతావరిని తీసుకోవడం వల్ల పొటాషియం స్థాయిలు మరింత తగ్గే అవకాశం ఉంది. కనుక మూత్రవిసర్జనకు సంబంధించిన మందులు వాడే వారు దీనిని వాడకపోవడమే మంచిది. ఈ విధంగా శతావరి మొక్క మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అయితే దీనిని ఉపయోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.