సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలు, ఎగవేతలు తప్ప ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ బస్తీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ‘మూసీ తీరాన బస్తీ పోరాటం’ అంశంపై హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రకాశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణకే తలమానికంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తే రెండున్నరేండ్లుగా దాన్ని తాళాలతో బంధించిన రేవంత్‌రెడ్డి రూ.5 వేల కోట్లతో గాంధీ విగ్రహాన్ని నిర్మిస్తానంటున్నారని విమర్శించారు. హైదరాబాద్‌కు మూలకారణమైన బస్తీలను కూల్చి ప్రజల బతుకులను ఆగం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఎర్రోళ్ల శ్రీనివాస్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరిట అంబానీకి, మూసీ సుందరీకరణ పేరిట అదానీకి దోచిపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో కూల్చవేతలు, ఎగవేతలు తప్ప సీఎం రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ బస్తీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ‘మూసీ తీరాన బస్తీ పోరాటం’ అంశంపై హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం ఆయన ప్రసంగించారు. డబ్బులిస్తే ఓట్లేసి, ఇండ్లు కూల్చినా, ఇబ్బందులు పెట్టినా బస్తీ వాసులు ఏమీ చేయలేరనే భ్రమలో సీఎం రేవంత్‌రెడ్డి బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. బస్తీ ప్రజలంతా ఏకమై ఓటుతోనే బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూల్చి పరిహారం పేరిట మోసం చేస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్‌రెడ్డిని నమ్మొద్దని హైదరాబాద్ బస్తీల ప్రజలకు సూచించారు. హైదరాబాద్ బస్తీల్లో అన్ని కులాల ప్రజలు కలిసి నివసిస్తారని, అదే ఐకమత్యంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడి తమ ఇండ్లను కాపాడుకోవాలన్నారు. మరో రెండేండ్ల పాటు కాపాడుకుంటే వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఒక్క ఇంటిని కూల్చకుండా మూసీ మురికిని పారదోలుతామని స్పష్టం చేశారు.
అంబానీ, అదానీలకు దోచిపెడుతున్న రేవంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరిట అంబానీకి, మూసీ సుందరీకరణ పేరిట అదానీకి దోచిపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. బస్తీ ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి లక్షన్నర ఇండ్లను కూల్చేందుకు సిద్ధమైంది. మూసీ పేరిట కమీషన్లు దండుకునేందుకు లక్షన్నర కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్ లేకుండా ప్రజలకు నోటీసులు ఇవ్వడం, ఇండ్లను రాత్రిరాత్రే కూల్చడం పూర్తి చట్టవిరుద్ధం. పేద, మధ్య తరగతి ప్రజల ఇండ్లను కూలుస్తూ తెలంగాణలో అరాచక పాలన సాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నదని రాహుల్ గాంధీ అంటుంటే అదే రాహుల్ గాంధీ పార్టీలో ఉండి తెలంగాణలో రేవంత్‌రెడ్డి బుల్డోజర్ రాజ్‌గా మారారు. అసలు రేవంత్‌రెడ్డి మోడీ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారా? రాహుల్ గాంధీ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారా? బస్తీల ప్రజలు ఏం చేసినా సహిస్తారని అనుకుంటున్న రేవంత్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పేందుకు అందరం కలిసి పోరాటం చేద్దాం. – దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
పింఛన్ ఇచ్చేందుకు డబ్బులేవు.. మూసీని శుద్ధి చేస్తారట
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు ఇచ్చేందుకు డబ్బులు లేవట కానీ… లక్షన్నర కోట్ల రూపాయలతో మూసీని శుద్ధి చేస్తారా? మూసీలోకి పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య కారకాలను ముందుగా నివారించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీని సుందరీకరించేందుకు ఎస్టీపీలు నిర్మించారు. కానీ బస్తీలు, అపార్ట్మెంట్లను కానీ టచ్ చేయలేదు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయలేదు. హైదరాబాద్‌పైన నిజాంకు ఉన్న ప్రేమలో ఒక్క శాతం కూడా రేవంత్‌రెడ్డికి లేదు. మూసీకి బఫర్‌జోన్ 10 మీటర్లు ఉంటే చాలు. రేవంత్‌రెడ్డి ప్రజల ఇండ్లను కూల్చడం మానేసి మూసీలోపల ఉన్న కట్టడాలను కూల్చాలి. అలా కూల్చాల్సి వస్తే మూసీ గర్భంలో ఉన్న మసీదులను కూల్చాలి, గుడులను కూల్చాలి, మెట్రోను కూల్చాలి, ఇమ్లీ బస్టాండ్‌ను కూల్చాలి. కానీ అవన్నీ వదిలేసి కష్టపడి అన్ని అనుమతులతో కట్టుకున్న పేదల ఇండ్లను కూల్చడమేంటి? నదుల ప్రక్షాళన ఏ దేశంలోనూ విజయవంతం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న సియోల్, సబర్మతి, గంగా, యమునా నదుల ప్రక్షాళన సక్సెస్ కాలేదు. ప్రక్షాళన జరగాలంటే ముందుగా మూసీలోకి వచ్చే కాలుష్య కారకాలను నియంత్రించాలి. బస్తీ ప్రజల జోలికొస్తే చూస్తూ సహించం, ఐక్యపోరాటాలకు మద్దతిస్తాం. – వీ ప్రకాశ్, నదులు, జలవనరుల నిపుణుడు
మూసీని కాసులు కురిపించే ఆధారంగా మారుస్తున్నరు ..
కాంగ్రెస్ ప్రభుత్వం మూసీని కాసులు కురిపించే ఆధారంగా మారుస్తున్నది. మూసీ రాజకీయ నాయకులది కాదు.. రాజకీయ పార్టీలది కాదు. మూసీ ప్రజలది. 300 ఇండ్లను రాత్రికి రాత్రే కూల్చి అక్కడి బస్తీవాసులను అక్రమ నివాసితులుగా చిత్రీకరించారు. మూసీ సుందరీకరణ ముఖ్యమంత్రి కల అంటున్నారు. ఆయన కలను సాకారం చేసేందుకు పేదల ఇండ్లను కూలుస్తామనడం దుర్మార్గమైన చర్య. మూసీ ప్రాజెక్టు 3379 ఎకరాల భూమిని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు భారీ కుట్ర చేస్తున్నారు. మూసీని బతకనివ్వాలి. మూసీని నాశనం చేస్తున్నది పరిశ్రమలు. వాటిని ఆపాలి. బస్తీవాసుల జీవించే హక్కు కోసం కలిసి పోరాడదాం.
– సజయ, మూసీ జన ఆందోళన సంఘటన్ ప్రతినిధి
బస్తీలను కూలిస్తే సహించం
హైదరాబాద్‌కు మూలకారణమైన బస్తీలను కూల్చి వారి బతుకులను ఆగం చేస్తామంటే చూస్తూ ఊరుకోం. బస్తీలు, బస్తీ ప్రజలు లేని హైదరాబాద్‌ను ఊహించగలమా? భవనాలను కట్టేది బస్తీవాసులు, నగరాన్ని నిర్మించింది బస్తీవాసులు.. ప్రజాప్రతినిధులను ఓట్లేసి గెలిపించింది బస్తీవాసులే. అలాంటి వారిని ఇబ్బందులకు గురిచేసి పాలన సాగిస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా పేదల ఇండ్లకు మార్కింగ్‌లు పెడుతూ రాత్రికి రాత్రే కూల్చేసి రేవంత్‌రెడ్డి పేదలపై యుద్ధం చేస్తున్నారు. మూసీ ఎఫ్టీఎల్లో బడా వ్యాపారులు, రాజకీయ నాయకుల ఇండ్లు, ఫామ్ హౌస్‌లు ఉన్నాయి. వాటిని ఎందుకు కూల్చట్లేరు? పేదలు ఏం చేయలేరు. వారి వెనుక ఎవరు లేరు అనుకుంటున్నారా? బస్తీ ప్రజలకు అండగా మేమున్నాం. ఇప్పటికైనా తీరు మార్చుకుని ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. లేదంటే ఉద్యమం తరహాలో పోరాటం చేసి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మెడలు వంచుతాం.
– ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ నేత
40 ఏండ్ల కింద ఏర్పడిన బస్తీలను కూలుస్తారా?
హైదరాబాద్ బస్తీలు 40 ఏండ్ల కిందటే ఏర్పడ్డాయి. అక్కడ అన్ని అనుమతులతో ఇండ్లు కట్టుకున్నారు. వాళ్లను ఇప్పుడు ఖాళీ చేయమనడానికి మీరెవరు? అసలు బఫర్ జోన్‌పైన, మూసీ ప్రాజెక్టుపైన ప్రభుత్వానికే స్పష్టత లేదు. పేద, మధ్యతరగతి ప్రజలను మాత్రం ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రజల ఇండ్లను కూలుస్తూ ఇంత ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం మునుపెన్నడూ లేదు. రిటెయినింగ్ వాల్ కడితే సరిపోయేదానికి వేల ఎకరాలను బహుళ జాతుల కంపెనీలకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. రెండున్నరేండ్ల నుంచి ప్రజల చీత్కారాలు ఎన్ని ఎదురవుతున్నా రేవంత్‌రెడ్డికి బుద్ధి రావడం లేదు. బస్తీల జేఏసీకి సంపూర్ణ మద్దతిస్తూ పోరాటాల్లో పాల్గొంటాం. – దేవి ప్రసాద్, బీఆర్ఎస్ నేత
గరీబోళ్ల జీవితాల్లో రేవంత్‌రెడ్డి నిప్పులు పోస్తుండు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గరీబోళ్ల జీవితాల్లో నిప్పులు పోస్తున్నడు. రేవంత్‌రెడ్డికి పెద్ద పెద్ద భవంతులు ఉండాలట. మా లాంటి పేదోళ్లకు మాత్రం ఒక్క చిన్న ఇల్లు కూడా ఉండొద్దట. ఇదేనా రేవంత్‌రెడ్డి చెబుతున్న ఇందిరమ్మ రాజ్యం? 40 ఏండ్ల కింద కాయకష్టం చేసి ఇల్లు కట్టున్నం. నాకున్న ఒక్క కొడుకు చనిపోయిండు. ఆయన ముగ్గురు పిల్లలతో ఆ ఇంట్లో ఉంటున్నం. ఇప్పుడు అది కూలుస్తం. ఖాళీ చేయాలని అంటున్నరు. ఇప్పుడు నేను ఆ పిల్లలను తీసుకోని ఎక్కడికి పోవాలె. ఈ సర్కారుకు కొద్దిగనన్నా జాలి దయ లేదా? రేవంత్‌రెడ్డి వచ్చిండు మా పానాలు తీస్తున్నడు. ఈ కాంగ్రెస్ వచ్చిన కానించి అందరినీ ఆగం చేస్తున్నరు. – సావిత్రమ్మ, శంకర్‌నగర్, ఓల్డ్ మలక్‌పేట
ఇండ్లిస్తమని అధికారంలోకి వచ్చి.. కూలుస్తున్నరు
పేద ప్రజలందరికీ ఇండ్లు కట్టిస్తమని హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చినాక ఉన్న ఇండ్లను కూలుస్తున్నరు. 40 ఏండ్ల నుంచి బస్తీల్లో ఉంటున్నం. ఇప్పటిదాకా వరదలు వచ్చి మా ఇండ్లు మునగలేదు. మాకు అన్ని రకాలుగా భద్రత ఉన్నది. అలాంటిది ఇప్పుడు రేవంత్‌రెడ్డి వచ్చి మా ఇండ్లు బఫర్ జోన్లో ఉన్నాయని అంటున్నడు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదోళ్లను ఇబ్బందులకు గురిచేసుడే పనిగా పెట్టుకున్నారు. మా కష్టంతో కట్టుకున్న ఇండ్లను కూల్చడానికి మీరెవరు? ఖమ్మంలో కూడా ఒక్కొక్కరూ గోడుగోడున ఏడుస్తున్నా వినకుండా ఇండ్లను కూల్చి పాపం మూటగట్టుకున్నరు. ఈ ప్రభుత్వం బస్తీలు, అపార్ట్మెంట్ వాసులను కూడా వదలకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
-ఇందిర, బస్తీ జేఏసీ నాయకురాలు