దుండిగల్/కుత్బుల్లాపూర్, మార్చి 7: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలోని అన్ని పండగులకు అసలైన గుర్తింపు, గౌరవం దక్కాయని, నేటి కాంగ్రెస్ పాలనలో పండుగలు తమ ఉనికిని కోల్పోతున్నాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం సూరారం డివిజన్ టీఎస్ఐఐసీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ఆవరణలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో రంజాన్ తోఫా, బతుకమ్మ చీరలు, క్రిస్మస్ గిఫ్ట్‌లతో అన్ని వర్గాల ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకొనేవారన్నారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను దగా చేస్తున్నదని, బడ్జెట్లో కనీస కేటాయింపులు లేకుండా కాంగ్రెస్ సర్కారు పండుగలను నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు పైసలు కరువయ్యాయన్నారు. రంజాన్ మాసం పవిత్ర మాసమని, ఆత్మపరిశుద్ధికి, సహనానికి, దానగుణానికి, సోదరభావానికి నిదర్శనమన్నారు. ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.