హైదరాబాద్, జులై 25 (నమస్తే తెలంగాణ) : నిమ్స్ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నిమ్స్ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ జనరల్ బాడీ సమావేశాన్ని అదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై సభ్యులు చర్చించి, నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షుడిగా డాక్టర్ మార్త రమేశ్, ఉపాధ్యక్షులుగా వై రాధిక, కే శ్రీనివాసరావు, నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా ఎమ్ రాజకుమార్, కోశాధికారిగా ఎస్ శ్రీనివాసులు, సలహాదారులుగా సత్యగౌడ్, శాంతి కుమారి, సంయుక్త కార్యదర్శులుగా ఎఫ్ వీణ, ఎం వేణుగోపాల్, రాజశేఖర్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎస్ఏ సలీంలను ఎన్నుకున్నారు.
సభ్యులందరి సహకారంతో సొసైటీ లక్ష్యాలు సాధించేందుకు కృషి చేస్తామని మార్త రమేశ్ తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులకు పూర్వ అధ్యక్ష, కార్యదర్శులు సత్యగౌడ్, శాంతికుమారి బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ నర్సింగ్ ఆఫీసర్స్ అధ్యక్ష, కార్య దర్శులు ఆశాలత, సౌజన్య, రమాదేవి, పారామెడికల్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు శాంతికుమారి, మహేశ్‌బాబు, విశ్రాంత ఉద్యోగుల అధ్యక్ష, కోశాధికారులు శరత్ బాబు, రామరాజు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు కేజియా రాణి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, జులై 25 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక టెట్ పరీక్షలో భాషా పండితులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. భాషా పండితులు వారు బోధిస్తున్న అంశాలకు సంబంధం లేని మ్యాథ్స్, సైన్స్, సోషల్ వంటి సబ్జెక్టుల ప్రశ్నలు (60 మారులు) ఎదురోవాల్సి వస్తుందని, వారి సబ్జెక్టుకే వారిని పరిమితం చేయాలని విజ్ఞప్తి చేశారు. హిందీ ఉపాధ్యాయులకు ఇంగ్లిష్‌తోపాటు తెలుగులో కూడా ప్రశ్నపత్రం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వయసు పైబడిన సీనియర్ ఉపాధ్యాయులకు వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.