లక్నో: ఆర్య సమాజ్లో వివాహం జరిగినట్లు ఇచ్చిన సర్టిఫికెట్ ఒక్కటే ఉంటే ఆ వివాహం చట్టబద్ధమైన హిందూ వివాహంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ రాజీవ్ సింగ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వివాహ స్థితిపై తప్పుడు ప్రకటన చేశారనే ఆరోపణలతో సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ) అధికారి రోహిత్ పాండేను ఉద్యోగం నుంచి తొలగించిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.
2007లో పాండేతో తనకు వివాహం జరిగిందని సుచేతా తివారి ఫిర్యాదు దరిమిలా ఈ వివాహం చెల్లుబాటైనదిగా భావించిన ఎస్ఎస్బీ.. పాండేను ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే ఆర్య సమాజ్ ఆలయం జారీ చేసిన ఏదైనా సర్టిఫికెట్ సమర్పించినంత మాత్రాన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వివాహం జరిగినట్లు చెప్పలేమని హైకోర్టు పేర్కొంది. ఆ వివాహాన్ని ఆధారంగా చేసుకుని పాండేను ఉద్యోగానికి అనర్హుడిగా పేర్కొనడం లేదా ఉద్యోగం నుంచి తొలగించడం సమర్థనీయం కాదని తెలిపింది.