బెంగళూరు, సెప్టెంబర్ 21 : చేసిన పనికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రభుత్వ అధికారులకు టిప్పులు ఇవ్వవచ్చని కర్ణాటక కాంగ్రెస్ మంత్రి శివలింగే గౌడ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో వివాదానికి దారితీశాయి. హాసన్ జిల్లాలో శనివారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో గౌడ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పనిని నిజాయితీగా, సకాలంలో పూర్తి చేసే అధికారికి ఏదైనా ఇవ్వడంలో తప్పు లేదని ఆయన పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల్లో అనేక ప్రశ్నలను లేవనెత్తాయి. మంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బయటకు రావడంతో వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే జీతాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు డబ్బు ఎందుకు ఇవ్వాలన్న ప్రశ్నలు ప్రజల నుంచి ఎదురవుతున్నాయి. అధికారులకు టిప్పులు ఎందుకివ్వాలని ఓ రైతు ప్రశ్నించాడు. ఇతర రైతులు కూడా ప్రశ్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
తన వ్యాఖ్యలను ప్రజలు అపార్థం చేసుకున్నారని అనంతరం మంత్రి గౌడ వివరణ ఇచ్చారు. తమ విధులను నిజాయితీగా, సకాలంలో పూర్తి చేసే అధికారులను అభినందింలని ఆయన చెప్పారు. అయితే ప్రజల నుంచి డబ్బు డిమాండ్ చేసే హక్కు ఏ ఉద్యోగికీ లేదని మంత్రి స్పష్టం చేశారు.