జగిత్యాల టౌన్, జూలై 26 : సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణే లక్ష్యంగా రాష్ట్రంలోని 33 జిల్లాలు, 119 నియోజకవర్గాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులను ఏకం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన జనజాగరణ యాత్ర ఆదివారం జగిత్యాల జిల్లాకేంద్రానికి చేరుకున్నది.
యాత్రకు నాయకత్వం వహిస్తున్న స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్‌కు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్‌కుమార్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గంగాధరి మహేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సర్వ సతీశ్, జిల్లా కోశాధికారి గొల్లపల్లి మహేశ్‌గౌడ్, రాష్ట్ర నాయకులు చుక్క కిరణ్, బోగ శ్రీనివాస్, సందుపట్ల రమశ్, వీరబత్తిని శ్రీనివాస్, బండారి సతీశ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘వీ వాంట్ ఓపీఎస్’ నినాదాలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకుని, క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు పోరాటంలో భాగంగా ఆగస్టు 23న హైదరాబాద్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.