న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24 : మైనర్ బాలిక, బాలుడిపై లైంగిక వేధింపులు, దాడి జరిగిన జముయి ఘటన మరువకముందే బీజేపీ పాలిత బీహార్లో మరో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. సమస్తిపూర్ జిల్లాలో ఒక బాలికపై జరిగిన లైంగిక దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ వీడియోలో ఆ బాలిక తనను వేధిస్తున్న వారి నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించడం కనిపించింది. కానీ వారు ఆమెను బలవంతంగా లాగుతూ, ఆమె శరీర భాగాలను తాకుతూ చివరకు ఆమెను మరో దిశలోకి కూడా ఈడ్చుకెళ్లడం ఆ వీడియోలో కనిపించింది.
ఈ సంఘటన కర్పురిగ్రామ్ పోలీసు స్టేషన్ పరిధిలోని బుధి గండక్ నది బైపాస్ కట్ట సమీపంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సమస్తిపూర్ ఎస్పీ అరవింద్ ప్రతాప్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం సాయంత్రం సోషల్ మీడియాను పర్యవేక్షిస్తుండగా ఒక యువతితో ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో తమ దృష్టికి వచ్చిందని ఎస్పీ పేర్కొన్నారు. ఒక పోలీసు అధికారి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ ఘటనతో ప్రమేయమున్న నిందితులందరినీ గుర్తించి ఆరు గంటల్లోగా అరెస్టు చేసినట్టు ఆయన చెప్పారు.