మేడ్చల్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ‘సర్’ ప్రక్రియతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో భారీగా ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తమవుతున్నది. ‘సర్’ కార్యక్రమానికి ముందు జిల్లాలో 29,79,310 మంది ఉండగా ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ ముసాయిదా జాబితాలో 19,07,564 మంది ఓటర్లే ఉన్నారు. అంటే దాదాపు 10 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయి. ప్రస్తుతం ఇస్తున్న నోటీసులు ఓటర్లను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 14,09,349 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 11,43,172 మందికి నోటీసులు జారీ చేయగా ఇంకా 2.66 లక్షల మందికి జారీ చేయాల్సి ఉన్నది. నోటీసులు అందుకున్నవారు బీఎల్వోలకు అవసరమైన గుర్తింపుకార్డులు అందజేస్తున్నారు. నోటీసులు అందనివారు తమ ఓటు ఉన్నదా లేదో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. నోటీసులకు స్పందన అంతంతగానే ఉన్నదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రక్రియ పూర్తయితే మరిన్ని ఓట్లు తగ్గే ప్రమాదం కనిపిస్తున్నది.
