ఏకపక్ష నిర్ణయాలతో పెత్తనం
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై దేశవ్యాప్తంగా వ్యక్తమైన అభ్యంతరాలు, అనుమానాల్లో నిజం ఉన్నదని రుజువైంది. మొదటి నుంచీ వివాదాస్పదంగా సాగుతున్న సర్ విషయంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఏకపక్ష పోకడలపై ఎన్నికల కమిషనర్లు ఇద్దరు లిఖితపూర్వకంగా తమ అసమ్మతిని, అభ్యంతరాలను తెలిపారని నిరూపిస్తూ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం సంచలనం సృష్టిస్తున్నది.
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై దేశవ్యాప్తంగా వ్యక్తమైన అభ్యంతరాలు, అనుమానాల్లో నిజం ఉన్నదని రుజువైంది. మొదటి నుంచీ వివాదాస్పదంగా సాగుతున్న సర్ విషయంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఏకపక్ష పోకడలపై ఎన్నికల కమిషనర్లు ఇద్దరు లిఖితపూర్వకంగా తమ అసమ్మతిని, అభ్యంతరాలను తెలిపారని నిరూపిస్తూ ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం సంచలనం సృష్టిస్తున్నది. గత పది నెలల్లో ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్సింగ్ సంధూ, వివేక్ జోషి తమ భిన్నాభిప్రాయాలను సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు రాత పూర్వకంగా 14 సార్లు తెలిపినా, వాటిని సీఈసీ ఖాతరు చేయలేదంటే రాజ్యాంగ సంస్థలు ఎంతగా పతమవుతున్నాయో తెలిసిపోతున్నది.
సర్ ప్రక్రియలో వివాదాలు పరిష్కరించే చర్యలను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయించి అమలు చేశారనీ ఎన్నికల కమిషనర్లు సంధూ, జోషీ తమ నోట్లో తేల్చిచెప్పారు. ఈ విషయాలు వెల్లడయ్యాక సీఈసీని అరెస్ట్ చేయాలని, అభిశంసించాలని విపక్షాల నేతలు, ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. సర్ ప్రక్రియ అమల్లో సీఈసీ చట్టవ్యతిరేకంగా చర్యలు చేపట్టారని లిఖిత పూర్వకంగా ఎన్నికల కమిషనర్లు చెప్పిన తర్వాత జ్ఞానేశ్ కుమార్ ఏడాది కాలంగా ఎలాంటి రాజ్యాంగ వ్యతిరేక పోకడలకు తెగించారో తెలుస్తున్నది. కేంద్రంలో పాలకపక్షానికి మేలు చేసే స్థాయిలో సీఈసీ పూర్తిగా ఏకపక్షంగా, పెత్తందారీ ధోరణితో వ్యవహరించారని ఆంగ్ల దినపత్రిక కథనం నిరూపించింది. ముగ్గురు సభ్యుల భారత ఎన్నికల కమిషన్‌లో నిర్ణయాలను మెజారిటీ అభిప్రాయం ప్రకారం తీసుకోవాలని చట్టం చెప్తున్నది.
ఈ లెక్కన ప్రస్తుత కమిషన్‌లోని ఇద్దరు కమిషనర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పుడు వారిది మెజారిటీ అభిప్రాయంగా పరిగణించాలి. కానీ, సర్‌కు సంబంధించిన ప్రతి కీలక అంశంలోనూ వారి అభిప్రాయాలను, అసమ్మతిని సీఈసీ జ్ఞానేశ్ తుంగలోకి తొక్కి తన ఇష్టప్రకారం ముందుకు సాగారు. అయినా, సర్ విషయంలో భిన్నాభిప్రాయాలున్నా నిర్ణయాలు ఏకగ్రీవంగానే జరిగాయని బుధవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒక ప్రకటనలో పేర్కొనడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది.
తోటి కమిషనర్ల అభిప్రాయాలను పట్టించుకోకుండా జ్ఞానేశ్ కుమార్ శరవేగంతో సర్‌ను ముందుకు ఉరికించడం దారుణమేగాక, రాజ్యాంగ విరుద్ధం కూడా. భిన్నాభిప్రాయాలను ఏకాభిప్రాయంతో తొలగించి ఉత్తర్వులు జారీ చేశారని, సర్ ఆదేశాలన్నీ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాలని ప్రకటించడం ఆయన దుస్సాహసానికి మచ్చుతునక. ఇద్దరు కమిషనర్ల అభ్యంతరాలు, భిన్నాభిప్రాయాలను ఏ విధంగా తొలగించి, వారిని ఏకాభిప్రాయ సాధనలో భాగం చేసినదీ సీఈసీ వెల్లడించలేదు.
వికేంద్రీకరణకు చోటులేకుండా సీఈసీ వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగ, చట్టవిరుద్ధంగా సర్ సాగుతున్నదంటూ ఎప్పటికప్పుడు ఎందరో నిపుణులు, మేధావుల, విపక్షాల నేతలు చెప్తున్న అభ్యంతరాలను ఎన్నికల సంఘం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణపై లేవనెత్తిన అభ్యంతరాల విషయంలో సుప్రీంకోర్టు కూడా సీఈసీకి అనుకూలంగా చెప్పడంతో జ్ఞానేశ్ కుమార్ ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది.
అయితే, ఓటర్ల జాబితా సవరణతోపాటు పౌరుల ఓటు హక్కు కాపాడడానికి ఈసీ దాదాపు 40 కొత్త చర్యలు తీసుకున్నదని ప్రకటించడం ద్వారా ఎన్నికల కమిషన్ తన అపరాధాలను దాచుకునే ప్రయత్నం చేస్తున్నది. ఓటర్ల జాబితాల సవరణ ఎప్పుడు జరిగినా దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య జనాభా నిష్పత్తిలో పెరిగింది. కొన్ని దశాబ్దాలుగా ఇండియాలో చేసిన అనేక ఓటర్ల జాబితాల సవరణలురూపకల్పనలలో తేలిన వాస్త వం ఇది. అయితే, ఇందుకు విరుద్ధంగా ఇప్పటి వరకూ సాగిన సర్ ప్రక్రియలో దాదాపు 13 కోట్ల కు పైగా ఓటర్ల పేర్లు తొలగించడం చట్టవ్యతిరేకమేగాక, ఇది సీఈసీ ఏకపక్ష ధోరణికి నిదర్శనం.
భారత ఎన్నికల సంఘాన్ని 1950లో ఏర్పాటు చేసినప్పుడు ఇది ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నాయకత్వంలోని ఏక సభ్య కమిషన్. 1989లో మరో ఇద్దరు కమిషనర్లను నియమించడంతో ముగ్గురు సభ్యుల సంఘం అయింది. 1989 అక్టోబర్ 161990 జనవరి ఒకటి మధ్య ఇలా ముగ్గురు సభ్యులతో కొద్ది నెలలు నడిచింది. అయితే చివరి రోజున ఎన్నికల కమిషనర్ పదవి రద్దు వల్ల మళ్లీ ఈసీఐ ఏక సభ్య సంఘమైంది. పీవీ నరసింహారావు హయాంలో చట్ట సవరణ ఫలితంగా 1993 అక్టోబర్ ఒకటిన ఇద్దరు కమిషనర్ల నియామకంతో ఇది మళ్లీ ముగ్గురు సభ్యుల కమిషన్‌గా మారి అదే తీరున కొనసాగుతున్నది. అప్పట్లో ఎన్నికల ప్రక్రియలో మార్పులు తీసుకొచ్చి, ఓటరు ఫొటో గుర్తింపు కార్డులు (ఎపిక్) రావడానికి నాటి సీఈసీ టీఎన్ శేషన్ అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. అయితే, ఎన్నికల కమిషనర్ల మాటలను పెడచెవిన పెట్టి శేషన్ విమర్శల పాలయ్యారు.
ఆ పరిస్థితుల్లో సీఈసీ నాయకత్వంలో ముగ్గురు కమిషనర్ల ఎన్నికల సంఘం అవసరం ఉన్నదని గుర్తించారు. ఈసీ అనేది మెజారిటీ నిర్ణయం ప్రకారం నడువాలనే చట్టంలోని ప్రధానాంశాన్ని శిరోధార్యంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుత సర్, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వివాదాల విషయానికి వస్తే మెజారిటీ కమిషనర్ల మాట సాగడం లేదనీ, సీఈసీదే పెత్తనమని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం నిరూపిస్తున్నది. సీఈసీ కనుసన్నల్లో సాగుతున్న అడ్డగోలు సర్ ప్రక్రియ ఫలితంగా వేసవిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన బెంగాల్లో 25 లక్షలకు పైగా ప్రజలు ఓటు హక్కు కోల్పోయారు. సర్ పేరుతో అమలు చేస్తున్న అసంబద్ధ నిబంధనల వల్ల బిహార్, బెంగాల్లో లక్షలాది మంది నిజమైన ఓటర్ల పేర్లు తుది జాబితాలో లేకుండా పోయాయి.
అవగాహన, అక్షరాస్యత కాస్త తక్కువ ఉన్న దేశంలో సామాన్య ప్రజలను నానా రకాల రుజువులు, ఆధారాలు తీసుకొచ్చి సిసలైన ఓటరుగా నిరూపించుకోవాలని సర్ పేరుతో ఈసీ ఆదేశించడం అన్యాయం. కేంద్రంలో పాలకపక్షానికి అనుకూలంగా కనిపించని ధార్మిక, సామాజిక వర్గాలకు చెందిన కోట్లాది ప్రజలకు ఓటు హక్కు లేకుండా చేయడానికి పన్నిన కుట్రగా ఇప్పుడు సర్ కనిపిస్తున్నది.
ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఒక కేంద్ర మంత్రితో కూడిన బృందం ఇప్పుడు చేస్తున్నది. అయితే, కేంద్ర మంత్రికి బదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలనే నిబంధన లేకుండా చేసిన పార్లమెంట్ చట్ట సవరణ ఫలితంగా పాలకపక్షం చెప్పినట్టు వినే సీఈసీలు వస్తారని ఇప్పుడు స్పష్టమైంది. అనేక విషయాల్లో మనకు ఆదర్శంగా చెప్పుకొనే అత్యంత గొప్ప ప్రజాతంత్ర దేశమైన అమెరికాలో పోలింగ్ రోజున సైతం దేశ పౌరులకు ఓటరుగా నమోదు చేయించుకుని ఓటు వేసే వెసులుబాటు ఉన్నదంటే మన ఎన్నికల వ్యవస్థ ఎంత వెనుకబడి ఉన్నదో అంచనా వేసుకోవచ్చు.
– నాంచారయ్య మెరుగుమాల
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

