– బీబీనగర్‌లో క్షేత్రస్థాయి తనిఖీలు
బీబీనగర్, జనవరి 9 : భూభారతి పెండింగ్ దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని యాదాద్రి భువనగరి కలెక్టర్ హనుమంత రావు అన్నారు. శుక్రవారం బీబీనగర్ మండల కేంద్రంలోని పిహెచ్సి, తాసీల్దార్ కార్యాలయంలో భూభారతి పెండింగ్ దరఖాస్తులపై అధికారులతో సమీక్ష, జైనపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ముందుగా బీబీనగర్ తాసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి కింద గ్రామాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చొరవ చూపాలని, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలు, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. అర్జీలను తిరస్కరించాల్సి వస్తే అందుకు గల కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని, చిన్నచిన్న సాంకేతిక కారణాలతో దరఖాస్తులను తిరస్కరించవద్దన్నారు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పూర్తి పారదర్శకతతో, భూభారతి చట్ట నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. తదుపరి సమీక్ష నాటికి స్పష్టమైన ప్రగతి కనిపించాలని పేర్కొన్నారు.

Bibinagar : ప్రజా సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి : కలెక్టర్ హనుమంతరావు
అనంతరం జైనపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలన్నారు. ఇండ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని తెలిపారు. రెండో విడతలో కూడా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ఇప్పటికే మంజూరైన ఇండ్ల పనులు త్వరగా పూర్తిచేస్తే కొత్త ఇండ్ల మంజూరుకు అవకాశం ఉంటుందని వివరించారు.
అధేవిదంగా బీబీనగర్ పట్టణ కేంద్రంలోని పిహెచ్‌సిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించి వైద్యులు, సిబ్బంది హాజరు వివరాలు తెలుసుకున్నారు. రోజువారీ రోగుల సంఖ్య, ఇన్ పేషెంట్ల వివరాలు, ఔషధాల లభ్యతపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, డీడీఎల్ రిజిస్టర్‌ను ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే అసంపూర్తిగా ఉన్న ఫ్లోర్‌ను శుభ్రం చేయాలని, బిల్డింగ్‌కు మెట్లు, కాంపౌండ్ వాల్ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ పర్యటనల్లో కలెక్టర్ వెంట తాసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.

Bibinagar : ప్రజా సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి : కలెక్టర్ హనుమంతరావు