న్యూఢిల్లీ: గత ఏడాది మహిళలు మెచ్చిన దేశంలోని నగరాల్లో బెంగళూరు బెస్ట్ సిటీగా నిలిచింది. చెన్నై, పూణే, హైదరాబాద్, ముంబై తర్వాత స్థానాల్లో ఉన్నాయి. (Best City for Women) చెన్నైకి చెందిన వర్క్‌ప్లేస్ ఇంక్లూజన్ సంస్థ అవతార్ ఈ అంశంపై ఒక స్టడీ నిర్వహించింది. సామాజిక మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ఇంక్లూజన్ ద్వారా మహిళలకు మద్దతు, అభివృద్ధికి ఏఏ నగరాలు అనుకూలంగా ఉన్నాయి అన్నది అధ్యయనం చేశారు. దేశంలోని 125 నగరాల్లో సర్వే చేశారు.
కాగా, దక్షిణ, పశ్చిమ మెట్రో నగరాలు మహిళలు మెచ్చిన టాప్ లిస్ట్‌లో నిలిచాయి. 53.29 సిటీ ఇంక్లూజన్ స్కోర్ (సీఐఎస్)తో బెంగళూరు టాప్‌లో ఉన్నది. దీనితో పాటు చెన్నై (49.86), పూణే (46.27), హైదరాబాద్ (46.04), ముంబై (44.49) మెట్రో సిటీలు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. గురుగ్రామ్, కోల్‌కతా, అహ్మదాబాద్, తిరువనంతపురం, కోయంబత్తూర్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
మరోవైపు మహిళలకు భద్రత, ఆరోగ్యం, విద్య, జీవన సౌలభ్యం వంటి అంశాల ఆధారంగా సోషల్ ఇంక్లూజన్ స్కోర్ (ఎస్ఐఎస్), ఉద్యోగ అవకాశాలు, కార్పొరేట్ ఇంక్లూజన్ పద్ధతులు, నైపుణ్యం, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ట్రాక్ చేసే ఇండస్ట్రియల్ ఇంక్లూజన్ స్కోర్ (ఐఐఎస్) ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు.
అయితే బలమైన భద్రతా వ్యవస్థలు, ప్రజా సేవలు, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి సామాజిక అంశాల ఆధారంగా మహిళకు నచ్చిన అగ్ర నగరంగా చెన్నై నిలిచింది. పారిశ్రామిక పురోగతి, ఉద్యోగం, జీవన సౌలభ్యం, దీర్ఘకాలిక కెరీర్ వృద్ధికి అత్యంత స్థిరమైన నగరాల్లో బెంగళూరు ముందున్నది.
మహిళల సామాజిక, పారిశ్రామిక సూచికల్లో సమతుల్యంగా పూణే, హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. స్థిరమైన మహిళా శ్రామిక, శక్తి భాగస్వామ్యానికి బలమైన అవకాశాలను ఈ నగరాలు సూచిస్తున్నాయని ఈ స్టడీ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
Also Read:
Contaminated Water | నిన్న ఇండోర్, నేడు నోయిడా.. కలుషిత తాగునీటి వల్ల పలువురు అనారోగ్యం
Man Makes Electric Jeep | లక్ష వ్యయంతో.. ఎలక్ట్రిక్ జీప్ తయారు చేసిన వ్యక్తి
Man Killed in Police Firing | పొరుగువారిపై కత్తితో దాడి.. పోలీస్ కాల్పుల్లో వ్యక్తి మృతి