గౌహతి: పొరుగున నివసించే భార్యాభర్తలపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడకు చేరుకున్న పోలీసులపై కూడా కత్తితో దాడికి అతడు ప్రయత్నించాడు. పోలీసులు కాల్పులు జరుపడంతో ఆ వ్యక్తి మరణించాడు. (Man Killed in Police Firing) అస్సాంలోని శివసాగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. డెమో ప్రాంతంలోని బోర్దిరోయ్ టీ ఎస్టేట్‌కు చెందిన 41 ఏళ్ల రంజిత్ పాండోవ్ మద్యానికి బానిసయ్యాడు. తాగిన మైకంలో హింసాత్మకంగా ప్రవర్తించేవాడు. భార్యా పిల్లలను అతడు కొట్టి హింసిస్తుండటంతో జనవరి 4న వారు తమ బంధువుల ఇంటికి వెళ్లారు.
కాగా, జనవరి 6న రాత్రి 8.30 గంటల సమయంలో రంజిత్ పాండోవ్ మద్యం సేవించాడు. పెద్దగా అరుస్తూ అక్కడ అలజడి సృష్టించాడు. పొరుగింటిలో నివసించే మోర్టిన్ పాండోవ్ అతడి భార్య గీతా ఇంటి నుంచి బయటకు వచ్చారు. తమ కుమార్తె 10వ తరగతి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్నదని, అరిచి గోల చేయవద్దని కోరారు.
మరోవైపు రంజిత్ పాండోవ్ మరింత ఆగ్రహం చెందాడు. పొడవైన కత్తితో ఆ దంపతులపై దాడి చేశాడు. మార్టిన్ మెడపై లోతైన గాయం కాగా, గీత కాలు తెగింది. తీవ్రంగా గాయపడిన వారిని తొలుత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం డిబ్రూగఢ్‌లోని అస్సాం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. మార్టిన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
అయితే మార్టిన్ దంపతులపై దాడి చేసిన రంజిత్ పాండోవ్ను అడ్డుకునేందుకు గ్రామ రక్షక దళం సభ్యులు ప్రయత్నించారు. అతడు వారిపై కూడా దాడికి ప్రయత్నించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అక్కడకు చేరుకున్న పోలీస్ కమాండోలు సుమారు 40 నిమిషాలకు పైగా రంజిత్‌ను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే అతడు కత్తితో మీదకు రావడంతో ఒక పోలీస్ కమాండో కాల్పులు జరిపాడు. గాయపడిన రంజిత్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
Also Read:
Contaminated Water | నిన్న ఇండోర్, నేడు నోయిడా.. కలుషిత తాగునీటి వల్ల పలువురు అనారోగ్యం
Watch: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన ఆటో.. వెనుక వచ్చిన బస్సు, తర్వాత ఏం జరిగిందంటే?
Watch: లారీ డ్రైవర్లను బెదిరించి.. డబ్బులు వసూలు చేస్తున్న మహిళలు